బెన్‌స్టోక్స్‌ దాడి చేసేసరికి...

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ స్వీప్‌షాట్లు ఆడటంతో లైన్‌ అండ్‌ లెగ్త్‌ మార్చుకోవాల్సి వచ్చిందని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ అన్నాడు. తన బౌలింగ్‌లో కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయని అంగీకరించాడు. నెట్స్‌లో సాధన చేసి తప్పులు దిద్దుకుంటానని వెల్లడించాడు. చెపాక్‌లో రెండో రోజు ఆట...

Updated : 07 Feb 2021 04:55 IST

లైన్‌ మార్చుకోక తప్పలేదన్న షాబాజ్‌ నదీమ్‌

చెన్నై: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ స్వీప్‌షాట్లు ఆడటంతో లైన్‌ అండ్‌ లెగ్త్‌ మార్చుకోవాల్సి వచ్చిందని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ అన్నాడు. తన బౌలింగ్‌లో కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయని అంగీకరించాడు. నెట్స్‌లో సాధన చేసి తప్పులు దిద్దుకుంటానని వెల్లడించాడు. చెపాక్‌లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. 44 ఓవర్లు వేసిన ఈ దేశవాళీ దిగ్గజం 167 పరుగులిచ్చి స్టోక్స్‌ (82), జో రూట్‌ వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

‘ఆఫ్‌సైడ్‌ ఆఫస్టంప్‌ వైపున్న గరుకు ప్రాంతాల్లో బంతులు వేసేందుకు ప్రయత్నించాను. స్టోక్స్‌ రివర్స్‌ స్వీప్‌తో ఎదురుదాడి చేయడంతో లైన్‌ మార్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత స్టంప్స్‌కు విసురుతూ అతడిని ఔట్‌ చేశా’ అని నదీమ్‌ అన్నాడు. మ్యాచులో ఇప్పటి వరకు అతడు ఆరు నోబాల్స్‌ విసిరాడు. దాంతో బౌలింగ్‌లో కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయని అంగీకరించాడు.

‘క్రీజుపై నేను కాస్త ఆలస్యంగా గెంతుతున్నట్టు అనిపించింది. మరికాస్త ముందుగా ఎగరాలి. ఇది కాస్త సమస్యగా మారింది. అయితే తొలిరోజుతో పోలిస్తే రెండోరోజు సమస్య తగ్గింది. పరిష్కారం కోసం నెట్స్‌లో శ్రమిస్తాను’ అని నదీమ్‌ తెలిపాడు. రూట్‌ స్వీప్‌ చేస్తుండటంతో బౌలింగ్‌ చేయడం కష్టమైందని వెల్లడించాడు.

‘రూట్‌ గొప్ప ఆటగాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. బంతిని చక్కగా స్వీప్‌ చేస్తున్నాడు. బంతులు ఎక్కడ వేయాలన్న దాన్ని మరింత బాగా కసరత్తు చేయాలి. బ్యాట్స్‌మన్‌ స్వీప్‌ చేశాడంటే బౌలర్లకు కష్టాలు తప్పవు. కానీ అతడు పొరపాటు చేసేవరకు ఎదురుచూడక తప్పదు. నేను స్టాండ్‌ బై బౌలర్‌గా వచ్చాను. అయితే బౌలింగ్‌ చేయాల్సి ఉంటుందని నాకు తెలుసు. మానసికంగా అందుకు సంసిద్ధమయ్యాను. నేను ఆడతానని ఒక రోజు ముందే నాకు తెలుసు’ అని నదీమ్‌ తెలిపాడు.

ఇవీ చదవండి
‘రూట్’‌ను తప్పించడం ఎందుకింత కష్టం!
సీన్‌ రిపీట్‌: ఇంగ్లాండ్‌దే పైచేయి

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని