ఆసీస్‌పై ‘ఇసుక తుపాను’ అలా మొదలైంది!

ఐపీఎల్‌లో ప్రత్యర్థుల్లా నువ్వానేనా అన్నట్లు తలపడిన భారత ఆటగాళ్లు తిరిగి జతకట్టారు. ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన కోసం ఏకమయ్యారు. ప్రాక్టీస్‌ సెషన్లలో తీవ్రంగా శ్రమిస్తూ కంగారూలపై పంజా విసరడానికి

Updated : 25 Nov 2020 09:33 IST

భారత్×ఆస్ట్రేలియా మధ్య భీకర పోరులు గుర్తున్నాయా?

ఐపీఎల్‌లో ప్రత్యర్థుల్లా నువ్వానేనా అన్నట్లు తలపడిన భారత ఆటగాళ్లు తిరిగి జట్టుకట్టారు. ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన కోసం ఏకమయ్యారు. ప్రాక్టీస్‌ సెషన్లలో తీవ్రంగా శ్రమిస్తూ కంగారూలపై పంజా విసరడానికి సన్నద్ధమవుతున్నారు. కాగా, ఇప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టంతా భారత్‌×ఆసీస్‌ వన్డే సిరీస్‌పైనే. కరోనా కారణంగా స్టేడియాలకు దూరమైన అభిమానులు తిరిగి నేరుగా వీక్షించడానికి అనుమతి లభించడం, సమవుజ్జీల మధ్య పోరు కావడంతో సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, ఇరు జట్ల మధ్య సాగిన గత హోరాహోరీ పోటీలను గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌×ఆసీస్‌ మధ్య జరిగిన భీకరమైన వన్డే పోరులను ఓ సారి చూద్దాం..

సచిన్‌ ధాటికి ఆసీస్‌ విలవిల

యూఏఈ వేదికగా 1998లో భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన కోకాకోలా కప్‌ కంగారూలకు పీడకలలా మిగిలింది. సచిన్‌ తెందుల్కర్‌ సంచలన ప్రదర్శనతో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొమ్మిది వికెట్లకు 272 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్టీవ్‌ వా, లెహమన్‌ అర్ధశతకాలతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ తొమ్మిది బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సచిన్‌ (134) శతకంతో చెలరేగగా, అజారుద్దీన్‌ (58) కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. షార్జాలో సచిన్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ను ‘ఇసుక తుపాను’గా అభిమానులు వర్ణిస్తారు.


యువీ గ్రాండ్ ఎంట్రీ

యువరాజ్‌ సింగ్ తన‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టడంతో ఆస్ట్రేలియాకు మరోసారి చుక్కెదురైంది. కెన్యా వేదికగా 2000లో జరిగిన ‘ఐసీసీ నాకౌట్‌ ట్రోఫీ’లోని క్వార్టర్‌ ఫైనల్లో ఆసీస్‌ను భారత్‌ 20 పరుగుల తేడాతో చిత్తుచేసింది. 18 ఏళ్ల యువీ 80 బంతుల్లో 84 పరుగులు బాదడంతో తొలుత టీమిండియా 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలోకి దిగిన స్టీవ్ వా సేన భారత బౌలర్ల ధాటికి 245 పరుగులకే కుప్పకూలింది. ఐసీసీ టోర్నీలో ఆసీస్‌కు ఇచ్చిన యువీ పంచ్‌ అప్పట్లో సంచలనం.


అనంతరం 2001లో ఆస్ట్రేలియా భారత్ పర్యటనకు వచ్చింది. అయిదు వన్డేల సిరీస్‌ను భారత్ 2-3తో కోల్పోయింది. అయితే ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సచిన్ ఆడిన ఇన్నింగ్స్‌ సిరీస్‌లో హైలైట్‌. బౌండరీల మోత మోగిస్తూ 125 బంతుల్లో సచిన్ 139 పరుగులు సాధించడంతో భారత్ 299 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌ 181 పరుగులకే ఆలౌటైంది. దీంతో గంగూలీ సేన సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కాగా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా పుంజుకుని సిరీస్ సొంతం చేసుకుంది.


భారత్‌ ఆశలకు ఆసీస్‌ చెక్‌

2003 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలవాలనుకున్న భారత్‌కు ఆసీస్ చెక్‌ పెట్టింది. టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి ట్రోఫీని అందుకుంది. ఈ మ్యాచ్‌లో రికీ పాంటింగ్ చెలరేగాడు. 121 బంతుల్లో అజేయంగా 140 పరుగులు చేశాడు. అనంతరం 360 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. సెహ్వాగ్‌ (82) పోరాడాడు.


యువీ స్పెషల్

2011 ప్రపంచకప్‌ను గెలిచిన భారత్.. క్వార్టర్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. యువరాజ్‌ సింగ్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ 260 పరుగులు చేసింది. అనంతరం భారత్ 47.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. యువీ రెండు వికెట్లతో పాటు 57* పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం సెమీస్‌లో పాక్‌, ఫైనల్లో శ్రీలంకను ఓడించి ధోనీసేన టైటిల్‌ను సాధించింది.


కోహ్లీ-రోహిత్ ధనాధన్

2013లో భారత్ పర్యటనకు వచ్చిన ఆసీస్‌కు పరాభవం ఎదురైంది. టీమిండియా వన్డే సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. కాగా, ఈ సిరీస్‌లో పరుగుల వరద పారింది. జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా భారత్ మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ విశ్వరూపం చూపించాడు. 52 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక బెంగళూరు వేదికగా జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ విధ్వంసమే సృష్టించాడు. 158 బంతుల్లో 209 పరుగులు బాదాడు. హోరాహోరీగా సాగిన ఈ సిరీస్ ఎంతో వినోదాన్ని అందించింది.


ఆసీస్‌ విజయాలకు బ్రేక్‌

అనంతరం రెండేళ్ల తర్వాత జరిగిన 2015 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ను ఆసీస్‌ ఓడించింది. స్టీవ్ స్మిత్ శతకంతో సత్తాచాటడంతో టీమిండియా 95 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. తర్వాత 2016లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ వన్డే సిరీస్‌ను 1-4తో కోల్పోయింది. అయితే స్వదేశంలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న ఆసీస్‌కు భారత్ షాక్ ఇచ్చింది. అయిదో వన్డేలో విజయం సాధించి.. ఆసీస్‌ 19 వరుస విజయాలకు బ్రేకులు వేసింది. ఈ మ్యాచ్‌లో మనీష్‌ పాండే తన తొలి శతకాన్ని నమోదుచేశాడు. అంతేగాక, 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి విదేశాల్లో తమ అత్యుత్తమ ఛేదన రికార్డును భారత్ నెలకొల్పింది.


తొలి ద్వైపాక్షిక సిరీస్..‌

2019లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచింది. కంగారూల గడ్డపై భారత్‌కు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయం. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో చాహల్ (6/42) సంచలన ప్రదర్శన చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 230 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ ఏడు వికెట్ల  తేడాతో ఘన విజయం సాధించింది. ధోనీ (87*) రాణించాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ, రోహిత్ శతకాలతో గొప్ప ప్రదర్శన చేశారు.


అయితే అదే ఏడాది భారత్‌కు వచ్చిన ఆసీస్ ప్రతీకారం తీర్చుకుంది. అయిదు వన్డేల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. భారత్ తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్‌లో తొలుత పైచేయి సాధించినా తర్వాత ఫించ్‌సేన గొప్పగా పుంజుకుంది. ఆ తర్వాత 2019 ప్రపంచకప్‌లో భారత్×ఆసీస్‌ మరోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ధావన్‌ శతకంతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, ఈ ఏడాది జనవరిలో భారత్‌కు ఆస్ట్రేలియా వచ్చింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వార్నర్‌, ఫించ్ అజేయంగా 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. అయితే కోహ్లీసేన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చెలరేగి మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో తేడాతో సొంతం చేసుకుంది. మరీ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రస్తుత సిరీస్‌లో ఈ సారి పైచేయి ఎవరు సాధిస్తారో చూడాలి! మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 27న సిడ్నీ వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని