Updated : 20 Oct 2020 16:18 IST

కుర్రాళ్లోయ్‌.. కుర్రాళ్లు!

తొలి సీజన్‌లోనే అలరిస్తున్న ఆటగాళ్లు..

టోర్నీ అంటే అందరికీ గుర్తొచ్చేది స్టార్‌ ఆటగాళ్లు. అనుభవంతో విధ్వంసం సృష్టించడం, ఒత్తిడిలో యార్కర్లు సంధించడం వారికి అలవాటే. కానీ అప్పటికప్పుడు అనూహ్యంగా తెరపైకి వచ్చి అలరించే వర్ధమాన క్రికెటర్లు కొందరుంటారు. అంచనాల్లేకుండా క్రీజులోకి వచ్చి సిక్సర్ల మోత మోగిస్తారు. అంతుచిక్కని బంతులతో మేటి బ్యాట్స్‌మెన్‌ వికెట్లు ఎగరగొడతారు. అలాంటి యువకులు ఈ సీజన్‌లోనూ ఉన్నారు. తమ తొలి సీజన్‌లోనే గొప్ప ప్రదర్శనతో ఆహా.. అనిపిస్తూ జట్టులో కీలకంగా మారిపోయారు. ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు.

భవిష్యత్‌ తార!
బెంగళూరు యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్ క్రికెట్‌ ప్రపంచానికి‌ సుపరిచితమే. అతడి ఆట చూస్తే తొలి సీజన్‌ ఆడుతున్నాడనే భావన ఎవరికీ కలగదు. అతడి ప్రదర్శన అంత గొప్పగా, నిలకడగా సాగుతోంది మరి. ఎంతో ఆత్మవిశ్వాసంతో బౌండరీలు బాదడం, బంతిని బట్టి షాట్లను ఎంచుకోవడం అతడి ప్రత్యేకత. అనుభవజ్ఞుడు ఆరోన్‌ ఫించ్ విఫలమైన సందర్భాల్లో కెప్టెన్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌లు చక్కదిద్దుతున్నాడు. అర్ధశతకాలు బాదుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొత్తంగా కోహ్లీసేనకు ఈ ఎడమచేతి వాటం ఆటగాడు కీలక ఆయుధంగా మారాడు. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన అతడు 33 సగటుతో 296 పరుగులు చేశాడు. దీనిలో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. భవిష్యత్‌లో కూడా ప్రదర్శన ఇలానే కొనసాగితే అతడు టీమిండియా జెర్సీ ధరించడానికి ఎక్కువ సమయం పట్టదు.

తిట్టుకున్న వాళ్లే..మెచ్చుకున్నారు
చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ యువ ఆటగాడు ప్రియమ్‌ గార్గ్‌ను దాదాపు అందరూ తిట్టుకున్నవాళ్లే. దానికి కారణం.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడి కారణంగా కేన్‌ విలియమ్సన్‌ రనౌటవ్వడం.  దీంతో హైదరాబాద్‌ ఓటమి లాంఛనమే అనుకున్నారంతా. కానీ గార్గ్‌ ఒత్తిడిలో పట్టుదలగా ఆడాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత బౌండరీల మోత మోగించాడు. 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 164 పరుగులు చేసిందంటే గార్గ్ వల్లే. దీంతో తొలుత తిట్టుకున్నవాళ్లే అతడిని కొనియాడారు. ఈ మ్యాచ్‌తో తానెంత ప్రమాదకరమో ప్రత్యర్థి జట్లకు తెలియజేశాడు. అందుకే వేలంలో ఈ అండర్‌-19 టీమిండియా సారథిని హైదరాబాద్‌ రూ.1.9 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన అతడు చెన్నైతో మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో అంచనాలను అందుకోలేదు.

తిప్పేస్తున్నాడు
అండర్‌-19 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన లెగ్‌ స్పిన్నర్‌ బిష్ణోయ్‌.. ఈ సీజన్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగాడు. దానికి తగ్గట్టుగానే రాణిస్తున్నాడు. ఊరిస్తున్న బంతులు వేస్తూ బ్యాట్స్‌‌మెన్‌ను బోల్తా కొట్టించడంతో పాటు గూగ్లీలతో ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో సత్తాచాటుకున్నాడు. కోచ్‌ అనిల్‌ కుంబ్లే పర్యవేక్షణలో ఈ యువ స్పిన్నర్‌ మరింత మెరుగవుతున్నాడు. హైదరాబాద్‌పై చేసిన ప్రదర్శన (3/29) అతడి అత్యుత్తమం. వేలంలో పంజాబ్‌ రూ.2 కోట్లు వెచ్చించి అతడిని తీసుకుంది.

బెంబేలెత్తిస్తున్న త్యాగి
విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేయడమే గాక ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ను పరుగులు చేయకుండా కట్టడి చేశాడు కార్తీక్‌ త్యాగి. 19 ఏళ్ల అతడి ప్రతిభను గురించి చెప్పేందుకు ఈ ఉదాహరణ సరిపోదా? తన తొలి మ్యాచ్‌లోని మొదటి ఓవర్‌లోనే వికెట్‌ సాధించిన అతడు.. బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. ఆలస్యంగా తుదిజట్టులోకి వచ్చినా రాజస్థాన్‌లో కీలక పేసర్‌గా మారిపోయాడు. షార్ట్‌ బాల్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను బోల్తాకొట్టించడం అతడి ప్రత్యేకత. యార్కర్లు, లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన అతడు ఆరు వికెట్లు తీశాడు. టీమిండియా అండర్‌-19 ప్లేయర్‌ త్యాగిని వేలంలో రాజస్థాన్‌ రూ.1.30 కోట్లకు సొంతం చేసుకుంది.

తుషార్‌ దేశ్‌పాండే..
ఈ సీజన్‌లో అరంగేట్రం చేసి అందర్నీ ఆకర్షించిన మరో ఆటగాడు తుషార్‌ దేశ్‌పాండే. యువ దిల్లీ జట్టులో పేసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు. చక్కని లైన్ అండ్‌ లెంగ్త్‌, బౌన్సర్లు అతడి అమ్ములపొదిలోని అస్త్రాలు. దిల్లీ అతడిని రూ.20 లక్షల కనీస ధరకే సొంతం చేసుకుంది. 

అయితే, ఎన్నో అంచనాల మధ్య ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌ (చెన్నై), యశస్వీ జైశ్వాల్ (రాజస్థాన్‌), అబ్దుల్ సమద్ (హైదరాబాద్‌)‌ సత్తా చాటలేకపోతున్నారు. చెన్నై బ్యాట్స్‌మన్‌ గైక్వాడ్ రెండు మ్యాచ్‌ల్లో 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. రాజస్థాన్ ఓపెనర్‌ జైశ్వాల్‌ మూడు మ్యాచ్‌ల్లో 40 పరుగులే చేశాడు. హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ సమద్‌ 71 పరుగులు, ఒక్క వికెట్ సాధించాడు. చక్కని ప్రతిభ ఉండటంతో భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని