Sunil Chhetri : అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దు!

అఖిల భారత ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్‌)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) వేటు వేస్తుందనే భయం కొనసాగుతూనే ఉంది. ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం...

Published : 15 Aug 2022 01:25 IST

సహచరులకు సూచించిన భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం సునిల్ ఛెత్రీ

ఇంటర్నెట్ డెస్క్‌: అఖిల భారత ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్‌) పాలనా వ్యవహారాల్లో  పలు కారణాలతో ఏఐఎఫ్‌ఎఫ్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) వేటు వేస్తుందనే భయం కొనసాగుతూనే ఉంది. ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం జాతీయ ఫెడరేషన్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రఫుల్ పటేల్‌ను జాతీయాధ్యక్షుడి పదవి నుంచి తొలగించిన సుప్రీంకోర్టు.. కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీఓఏ)ను నియమించింది. ఆగస్ట్‌ 28న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జట్టుపై ఫిఫా నిషేధం విధిస్తుందేమోననే ఆందోళనలో ఆటగాళ్లు ఉన్నారు. అయితే సీనియర్‌ ప్లేయర్‌ సునిల్ ఛెత్రి మాత్రం ఆటగాళ్లకు ధైర్యం చెబుతున్నాడు. బయట జరిగే పరిణామాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆటపై దృష్టి పెట్టాలని సూచించాడు. 

‘‘నేను ఇప్పటికే మా ఆటగాళ్లతో మాట్లాడాను. ఒకటే చెప్పా.. ఇలాంటి అంశాలపై ఫోకస్‌ చేయొద్దు. ఎందుకంటే ఇదేమీ మన నియంత్రణలో ఉండేది కాదు. ఆట మీద దృష్టి సారించాలి. ప్రస్తుతం సమస్యను పరిష్కరించేందుకు అందులోని భాగస్వాములు కృషి చేస్తున్నారు. తప్పకుండా సానుకూల ఫలితం వస్తుందని భావిస్తున్నా. అందుకే మనమంతా అత్యున్నత ఆట ఆడేందుకు ప్రయత్నించాలి. ఆటగాడిగా ఉత్తమ ఆటతీరు ప్రదర్శిస్తే ఎప్పటికైనా క్లబ్‌ లేదా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది’’ అని సునిల్ ఛెత్రీ తెలిపాడు. అక్టోబర్‌ 11-30 మధ్య మహిళల అండర్ -17 ప్రపంచకప్‌ పోటీలు భారత్‌ వేదికగా జరగాల్సి ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అయితే ఫిపా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ కొనసాగుతోంది. 

దురంద్‌ కప్‌ నాకెంతో ప్రత్యేకం: ఛెత్రీ

ఆసియాలోనే అతి పురాతన ఫుట్‌బాల్‌ పోటీలు దురంద్‌ కప్. ప్రస్తుతం 131వ ఎడిషన్‌ కోల్‌కతా వేదికగా ఆగస్ట్‌ 16 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌ - జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ జట్లు తలపడతాయి. ప్రస్తుతం ఛెత్రీ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘‘దురంద్ కప్ నాకెప్పుడూ వెరీ వెరీ స్పెషల్‌. శతాబ్దంపైగా నిర్వహిస్తున్న టోర్నీ అనే కాకుండా ఈసారి మా జట్టు గెలవాలి. చాలా టోర్నమెంట్లను గెలిచాను కానీ నేను ఇప్పటి వరకు దురంద్ కప్‌ను సొంతం చేసుకోలేదు’’ అని ఛెత్రీ తెలిపాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts