Sunil Gavaskar: మేమింకా కోహినూర్‌ డైమండ్‌ కోసం ఎదురుచూస్తున్నాం: గావస్కర్‌

భారత ప్రజలు ఇప్పటికీ కోహినూర్‌ డైమండ్‌ కోసం ఎదురుచూస్తున్నారని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న...

Updated : 12 Apr 2022 10:47 IST

ముంబయి: భారత ప్రజలు ఇప్పటికీ కోహినూర్‌ డైమండ్‌ కోసం ఎదురుచూస్తున్నారని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆయన.. ఆదివారం వాంఖడే వేదికగా రాజస్థాన్‌, లఖ్‌నవూ జట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ విరామ సమయంలో ప్రసారదారులు స్టేడియం పక్కనే ఉన్న మెరైన్‌ డ్రైవ్‌ను ఏరియల్‌ వ్యూ ద్వారా చూపించగా.. దానికి ‘క్వీన్స్‌ నెక్లెస్‌’ అనే పేరుందని చెప్పాడు.

ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఇంగ్లిష్‌ కామెంటేటర్‌ అలన్‌ విల్కిన్స్‌తో సన్నీ ఇలా సరదాగా సంభాషించాడు. ‘మేమింకా కోహినూర్‌ వజ్రం కోసం ఎదురుచూస్తున్నాం’ అని అన్నాడు. దీంతో ఇద్దరూ నవ్వుకొని సంబరపడ్డారు. అనంతరం విల్కిన్స్‌ అందుకొని.. ‘గావస్కర్‌ ఈ మాటలు అంటాడని నాకు తెలుసు’ అని బదులిచ్చాడు. తిరిగి గావస్కర్‌ అందుకొని.. ‘మీకు ఏమైనా ప్రత్యేక పలుకుబడి ఉంటే బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని అడిగి కోహినూర్‌ డైమండ్‌ను తిరిగి భారత్‌కు ఇవ్వమని చెప్పండి’ అని సున్నితమైన హాస్యం జోడించాడు. కాగా, భారత్‌కు చెందిన అత్యంత విలువైన కోహినూర్‌ డైమండ్‌ ప్రస్తుతం బ్రిటిష్‌ రాణి కిరీటంలో పొదిగి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, గావస్కర్‌ కోహినూర్‌పై సరదాగా చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీంతో అతడు విల్కిన్స్‌ను ఆ డైమండ్‌ గురించి అడగడం బాగుందని పలువురు పోస్టులు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని