IPL 2023: ఈ కుర్రాడికి టీమ్‌ఇండియాలో అవకాశం ఇవ్వాలి: సునీల్ గావస్కర్

భారత జట్టులోకి వచ్చేందుకు యువ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. అందుకు వేదికగా ఐపీఎల్‌ను (IPL 2023) చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Published : 20 May 2023 12:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో (IPL 2023) యువ క్రికెటర్లు అదరగొట్టేస్తున్నారు. సీనియర్లకు దీటుగా పరుగులు రాబడుతూ జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. తాజాగా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ (PBKS vs RR) విజయం సాధించడంలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక పాత్ర పోషించాడు. అర్ధశతకం సాధించాడు. ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో రెండో స్థానం అతడిదే. మొత్తం 14 మ్యాచుల్లో 625 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో యశస్విని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లూ పెరిగాయి. టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా యశస్వికి మద్దతుగా నిలిచాడు. అతడిని తప్పకుండా భారత జట్టుకు ఎంపిక చేయాలని సూచించాడు. సాంకేతికంగా అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయని అభినందించాడు. 

‘‘టీ20 క్రికెట్‌లో ఓ పాతిక బంతుల్లో 40 నుంచి 50 పరుగులు చేస్తే మంచి బ్యాటర్‌గా పరిగణించాలి. అతడికి అవకాశాలు ఇస్తూ వెళ్లాలి. అదే ఓపెనర్‌గా వచ్చి 15 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉన్నాడంటే కచ్చితంగా సెంచరీ సాధించగలడు. అప్పుడు జట్టు స్కోరు కూడా 200 మార్క్‌ను చేరుకోగలదు. ఇలానే ఈ సీజన్‌లో ఆడుతున్న ఆటగాడు యశస్వి జైస్వాల్. అతడి బ్యాటింగ్‌ను చూస్తే సంతోషంగా ఉంది. టెక్నికల్‌గా చాలా బాగా ఆడుతున్నాడు. టీమ్‌ఇండియాకు ఆడేందుకు యశస్వి సిద్ధంగా ఉన్నాడు. తప్పకుండా అతడికి అవకాశం ఇవ్వాలి. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఆడే ఛాన్స్‌ లభిస్తే.. ప్రదర్శన కూడా ఉన్నతస్థాయిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టేటప్పుడు నేను సిద్ధంగా ఉన్నానా..? లేదా..? అని ఆటగాడికి అనుమానం రావడం సహజం. ఫామ్‌లో లేకపోతే ఆ అనుమానాలు ఇంకా పెరుగుతాయి. అందుకే, అరంగేట్రం చేసేందుకు ఫామ్‌ చాలా కీలకం. యశస్వి ఇప్పుడు ఇదే స్థితిలో ఉన్నాడు. తప్పకుండా అతడిని టీ20 జట్టులోకి తీసుకోవాలి’’ అని సునీల్ గావస్కర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని