Asia Cup 2023: భారత్ - పాక్‌ గురించే మాట్లాడుకుంటున్నాం.. ఆ జట్టూ ప్రమాదకరమే: గావస్కర్

ఐసీసీ లేదా ఏసీసీ నిర్వహించే టోర్నీల్లో ప్రధాన ఆకర్షణ భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) జట్లే. వీటి మధ్య పోరు ఎలా ఉంటుందనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంటుంది. ఆసియా కప్‌లో (Asia Cup 2023) ఈ రెండు జట్లే కాకుండా మరొకటి ప్రమాదకరమని భారత క్రికెట్‌ దిగ్గజం వ్యాఖ్యానించాడు.

Published : 30 Aug 2023 17:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ టోర్నీలో (Asia Cup 2023) భారత్, పాకిస్థాన్‌ గురించే చర్చించుకుంటున్నారు. ఇరు జట్లలో ఎవరు పైచేయి సాధించి కప్‌ను అందుకుంటారని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ రెండు టీమ్‌లతోపాటు మరో జట్టు కూడా ప్రమాదకరమని టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) వ్యాఖ్యానించాడు. శ్రీలంక జట్టును తక్కువగా అంచనా వేయొద్దని, స్వదేశంలో జరగనుండటం వారికి కలిసొస్తుందని పేర్కొన్నాడు. గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన టోర్నీ విజేతగా శ్రీలంక నిలిచిందని గుర్తు చేశాడు. 

‘‘ఆసియా కప్‌ అనగానే భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) పోరు గురించే మాట్లాడుకుంటాం. అయితే, శ్రీలంకను (Srilanka) మాత్రం మరిచిపోకూడదు. వారు కూడా ఆసియా కప్‌ను పలుసార్లు గెలుపొందారు. గతేడాది కూడా వారే ఛాంపియన్‌. కాబట్టి భారత్‌, పాకిస్థాన్‌తోపాటు శ్రీలంక మధ్య పోటీ ఎప్పుడూ ప్రత్యేకమైందే. ఇక్కడ మరో అంశంపై మాట్లాడతా. ఈ ఆసియా కప్‌లో ఎవరు ఫేవరేట్‌ అని అడుగుతుంటారు. కానీ, ఎవరినీ ఎంచుకోవడం లేదు. టీమ్‌ఇండియా ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అంతేకానీ, సెమీస్‌కు ఎవరు చేరతానేది పెద్ద విషయమే కాదు. 

భారత్‌ X పాకిస్థాన్ పోరు.. ఐదు ప్రశ్నలు సంధించిన మాజీ క్రికెటర్!

వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) కూడా మరో నెల రోజుల వ్యవధిలో ఉండటంతో టీమ్‌ మేనేజ్‌మెంట్ ప్రతి ఆటగాడి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. దాని కోసం వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్ చాలా కీలకం. ప్రతి ఒక్కరికి తమ శరీరం ఎలా స్పందిస్తుందనేది తెలుసు. అలాగే ఫిజియోథెరపిస్ట్‌కూ తెలుస్తుంది. తమ బాడీ ఎక్కడ ఇబ్బంది పడుతుందో గ్రహించి దానికి తగ్గట్లుగా సిద్ధం కావాలి. అలాంటి వారికి విశ్రాంతి ఇవ్వాలి. మూడు లేదా నాలుగు రోజులు రెస్ట్‌ ఇవ్వకపోతే గాయం ముదిరే అవకాశం ఉంటుంది’’ అని గావస్కర్‌ తెలిపాడు. ఇప్పటికే భారత ఆటగాడు కేఎల్ రాహుల్ రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 31న బంగ్లాదేశ్‌తో శ్రీలంక, సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు