Hardik Pandya-Sunil Gavaskar: అతడినీ తీసుకొస్తే.. టెస్టుల్లోనూ మనమే అజేయులం: సునీల్ గావస్కర్

టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కూడా కైవసం చేసుకుంటే భారత్‌ ఖాతాలో అన్ని ఐసీసీ ట్రోఫీలు ఉన్నట్లే. అదేవిధంగా టెస్టుల్లోనూ అగ్రస్థానంలోకి దూసుకొచ్చేందుకు ఆస్కారం ఉంది.

Updated : 11 Jul 2024 13:43 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఐసీసీ ర్యాంకుల్లో భారత జట్టు వన్డే, టీ20ల్లో టాప్‌ ర్యాంకర్. టెస్టుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పొట్టి కప్‌లో హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించాడు. అయితే, అతడు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌ను మాత్రమే ఆడుతున్నాడు. టెస్టుల్లోకి 2017లోనే అడుగుపెట్టిన అతడు ఒక్క ఏడాదిలోనే 11 మ్యాచ్‌లు ఆడాడు. చివరిగా 2018లో టెస్టు ఆడిన హార్దిక్‌ గాయాల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి జనవరి వరకు భారత్‌ వరుసగా టెస్టు సిరీస్‌లను ఆడనుంది. దీంతో రాబోయే రెండు నెలల్లో హార్దిక్‌ను ఎలాగైనా ఒప్పించి టెస్టుల్లోకి మళ్లీ తీసుకురావాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) సూచించాడు. అప్పుడు ఈ ఫార్మాట్‌లోనూ భారత్‌కు తిరుగుండదని వ్యాఖ్యానించాడు.

‘‘హార్దిక్‌ పాండ్య టెస్టుల్లోనూ బౌలింగ్‌ చేయగలిగితే భారత జట్టుకు ఎంతో ప్రయోజనం. వచ్చే రెండు నెలల్లో పాండ్యను ఒప్పించాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై (Team India) ఉంది. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విలువైన పరుగులు చేసినా చాలు. రోజుకు కనీసం 10 నుంచి 15 ఓవర్లు వేస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించడం పెద్ద కష్టమేం కాదు. ఎలాంటి పిచ్‌పైనైనా అతడు రాణించగల సమర్థుడే. అతడు జట్టులో ఉంటే టెస్టుల్లోనూ మనం అజేయులం అవుతాం’’ అని గావస్కర్ తెలిపాడు. వచ్చే ఏడాది జూన్‌లోనే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది.

కొత్త కోచ్‌ ఆధ్వర్యంలోనైనా..?

కొత్త కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ వస్తున్న నేపథ్యంలో హార్దిక్‌ను టెస్టులు ఆడేలా ప్రోత్సహిస్తాడని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గంభీర్‌ నియామకంపై తొలుత హార్దిక్‌కే సమాచారం వచ్చిందని.. రోహిత్-విరాట్ ద్వయంతో ఆ చర్చ జరగలేదనే సమాచారం బయటకొచ్చింది. ఇప్పటికే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు హార్దిక్‌నే కెప్టెన్‌గా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. 

రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ఫ్యామిలీతో సన్నీ

బుధవారం సునీల్ గావస్కర్ 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే, సన్నీ మాత్రం ఓ బాలీవుడ్‌ నటుడి కుమారులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ యాక్టర్ రితేశ్‌ దేశ్‌ముఖ్. అతడి కుమారులతో సంభాషించిన గావస్కర్ వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని