WTC Final: అప్పటికే భారత ఆటగాళ్లలో అలసట కనిపించింది: సునీల్ గావస్కర్

ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్, స్టీవ్‌ స్మిత్ క్రీజ్‌లో పాతుకుపోయి పరుగులు సాధించడంతో భారత శిబిరంలో కలవరం రేగింది. వారిని ఔట్‌ చేసేందుకు టీమ్‌ఇండియా బౌలర్లు శ్రమించినా ఫలితం దక్కలేదు.

Published : 08 Jun 2023 12:27 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final 2023) మ్యాచ్‌లో టీమ్‌ఇండియా టాస్‌ నెగ్గి బౌలింగ్‌ను ఎంచుకుంది. ఆరంభంలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఓపెనర్ల వికెట్లు తీశారు. భోజన విరామం ముగిసిన తర్వాత రెండో ఓవర్‌లోనే కీలకమైన లబుషేన్ వికెట్‌ను పడగొట్టారు. మ్యాచ్‌ మన చేతిలోనే ఉందనుకున్న సమయంలో కాస్త పట్టు సడలించారు. అంతే, ట్రావిస్‌ హెడ్ (146*) దూకుడుగా ఆడేశాడు. అతడికి తోడుగా మరో ఎండ్‌లో స్మిత్ (95*) నెమ్మదిగా ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెటకు 251 పరుగులు జోడించారు. తొలి రోజు ఆట ముగిసేసమయానికి 327/3 స్కోరుతో ఆసీస్‌ నిలిచింది. ఈ క్రమంలో టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.  భారత ఆటగాళ్లు చివరి సెషన్‌ నాటికి అలసిపోయినట్లు కనిపించారని వ్యాఖ్యానించాడు. 

‘‘ఆసీస్‌ అద్భుతంగా పుంజుకొని పరుగులు చేసింది. అయితే, భారత్ ఆటగాళ్లు మాత్రం చివరి సెషన్‌లో అలసిపోయినట్లు కనిపించారు. నిరుత్సాహానికి గురైనట్లు అనిపించింది. ట్రావిస్‌ హెడ్ - స్మిత్‌ ఇలానే ఆడితే ఆసీస్‌ 550 - 600 పరుగులు సాధించడం ఖాయం. భారత బౌలర్లు త్వరగా వికెట్లను తీయాలి’’ అని సన్నీ తెలిపాడు. రెండో రోజు ఆటలో భారత్‌ బౌలర్లు త్వరగా ఆసీస్‌ను కట్టడి చేయాలి. 

ఇద్దరికీ సమాన అవకాశాలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్‌ ఫేవరేట్‌ అని రికీ పాంటింగ్‌ సహా పలువురు మాజీలు వ్యాఖ్యానించడంపై సునీల్‌ గావస్కర్ స్పందించాడు. ‘‘అలాంటిదేమీ ఉండదు. ఇద్దరికీ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. నేను టీమ్‌ఇండియాకే కాస్త మొగ్గు చూపుతా.  పిచ్‌ పరిస్థితులు ఆసీస్‌కు ఫేవర్‌గా ఉన్నాయనేది అంగీకరించను. ఇరు జట్లకూ ఒకటే. భారత జట్టులో అందరూ బాగా ఆడేవారే. పుజారా ఇక్కడే కౌంటీ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లోనూ భారత ఆటగాళ్లు రాణించారు’’అని గావస్కర్‌ చెప్పాడు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని