Rohit Sharma- Sunil Gavaskar: రోహిత్ ప్రజల కెప్టెన్‌... వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోలేదు: గావస్కర్‌

భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించిన రోహిత్‌ శర్మను క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ప్రశంసల్లో ముంచెత్తాడు.

Published : 08 Jul 2024 22:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup) అందించిన రోహిత్‌ శర్మను (Rohit Sharma) క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) అభినందించాడు. ధోని (Dhoni), కపిల్‌దేవ్‌ (Kapil Dev)లా రోహిత్ కూడా ప్రజల కెప్టెన్ అని కొనియాడాడు. ‘‘ 2007లో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించినపుడు, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచినపుడు రోహిత్‌ టీమ్ఇండియాలో ఉన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల రోహిత్ సేన భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించింది.

భారత జట్టును అజేయంగా నిలపడంలో రోహిత్‌ ప్రధాన పాత్ర పోషించాడు. ఇది అతని జీవితంలో గొప్ప విజయం. ఈ నేపథ్యంలో భారత్‌ జట్టుకు ప్రపంచకప్‌లను పరిచయం చేసిన కపిల్‌దేవ్‌, ధోని సరసన చేరాడు. వీరిద్దరిలాగే రోహిత్‌ కూడా ప్రజల కెప్టెన్ అని నిరూపించుకున్నాడు. క్రికెట్‌ అభిమానులందరూ అతని నాయకత్వ పటిమను గుర్తించారు. ఆట ఆడుతున్నప్పుడు చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. జట్టుకు అవసరమైన దానికంటే ఎక్కువగా కష్టపడతాడు’’ అని గవాస్కర్‌ ఓ పత్రికకు రాసిన కథనంలో పేర్కొన్నాడు.

‘‘ఈ టోర్నమెంట్‌లో రోహిత్ 156.70 స్ట్రైక్‌ రేట్‌తో 257 పరుగులు చేశాడు. తన వ్యక్తిగత మైలురాళ్ల కోసం కాకుండా జట్టు విజయం కోసం కృషి చేశాడు. ప్రతిసారి భారీ స్కోరు సాధించేందుకు మంచి ప్రారంభం ఇవ్వాలని పరితపించేవాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచుల్లో వేగంగా అర్ధశతకం చేసి కీలక సమయాల్లో జట్టుకు అండగా నిలిచాడు. అతను కెప్టెన్‌గా ఉండటం టీమ్‌ ఇండియా అదృష్టం’’ అని రాసుకొచ్చాడు. టీమ్ ఇండియాకు కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్‌ కృషికి తగిన ఫలితం లభించిందని గావస్కర్‌ ప్రశంసించాడు.  ప్రపంచకప్‌ సాధించడంలో ద్రవిడ్ నేతృత్వంలో పనిచేసిన సహాయక సిబ్బందిని కూడా అభినందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని