Updated : 25 Apr 2022 12:57 IST

Sunil Gavaskar: ఇషాన్‌ ఇలాగైతే కష్టం.. అతడలా ఉన్నాడు: గావస్కర్

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ షార్ట్‌పిచ్‌ బంతులకు ఇబ్బంది పడటం మంచిది కాదని టీమ్‌ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో అతడు 20 బంతులాడి కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే దుష్మంత చమీరా వేసిన ఓ షార్ట్‌పిచ్‌ బంతి.. ఇషాన్‌ హెల్మెట్‌ను తాకింది. ఇంతకుముందు కూడా పలుమార్లు షార్ట్‌పిచ్‌ బంతులకు ఇబ్బందిపడ్డాడు. ఈ నేపథ్యంలోనే గతరాత్రి మ్యాచ్‌ అనంతరం ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన గావస్కర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు స్లిప్‌లో దొరికిన బంతి కనీసం నిజంగా క్యాచ్‌కు వెళ్లిందా లేదా నేలను తాకి ఫీల్డర్‌ చేతిలో పడిందా అని నిర్ధారించుకోకుండానే పెవిలియన్‌ బాటపట్టాడని గావస్కర్‌ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడిన ఇషాన్‌.. చివరికి రవిబిష్ణోయ్‌ వేసిన 7.1 ఓవర్‌ గూగ్లీ బంతికి స్లిప్‌లో జేసన్‌ హోల్డర్‌ చేతికి చిక్కాడు. అయితే, అంతకుముందే ఆ బంతి వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ బూటుకు తగిలి నేరుగా వెళ్లి హోల్డర్‌ చేతుల్లో పడింది. దీంతో అంపైర్‌ ఔటివ్వకుండా అతడు పెవిలియన్‌కు వెళ్లడం కనిపించింది. తర్వాత అంపైర్‌ ఆగమని చెప్పాక.. ఔటయ్యాడో, కాదోనని నిర్ధారించుకున్నాక వెళ్లిపోయాడు. దీనిపైనా గావస్కర్‌ స్పందించాడు. ‘అతడు ఈ మ్యాచ్‌లో బాగా ఇబ్బందిపడ్డాడు. క్రీజులో ఉండాలనుకోలేదు. సహజంగా ఎవరికైనా బంతి ఎడ్జ్‌ తీసుకొని వెళ్లి ఫస్ట్‌స్లిప్‌లో చిక్కితే ఆ బ్యాట్స్‌మన్‌ కచ్చితంగా ఔటో కాదో తెలుసుకునేంత వరకు వేచిచూస్తారు. ఇక్కడ ఇషాన్‌ అలా కనిపించలేదు. బంతి హోల్డర్‌ చేతుల్లో పడగానే పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ బంతి నేలను కూడా తాకే అవకాశం ఉంది. అంపైర్‌ పిలిచేదాకా.. దాన్ని నిర్ధారించుకోకుండానే పెవిలియన్‌కు బయల్దేరాడు. అది అతడి మానసికస్థితి తెలియజేస్తోంది’ అని బ్యాటింగ్‌ గ్రేట్‌ వివరించాడు.

అనంతరం ఇషాన్‌ షార్ట్‌పిచ్‌ బంతుల విషయంపై మాట్లాడుతూ.. ‘చమీరా వేసిన బంతి హెల్మెట్‌కు తాకడంతో జడుసుకున్నాడనుకుంటా. గతంలో కూడా అతడికి బంతి హెల్మెట్‌ను తాకిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇలా ఆడితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లోని బౌన్సీ పిచ్‌లపై ఇంకా ఇబ్బందులు పడతాడు. ప్రతి ఒక్క పేసర్‌ అతడికి షార్ట్‌పిచ్‌ బంతులే వేస్తారు. అతడికి కావాల్సిన విధంగా బౌలింగ్‌ చేయరు. నడుముపైకొచ్చే బంతుల్ని ఇప్పుడు అస్సలు ఆడలేకపోతున్నాడు. అప్పుడు బంతులన్నీ అతడి మీదకే సంధిస్తారు’ అని గావస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని