Sunil Gavaskar: నేను సెలెక్టర్ అయితే.. టీ20 ప్రపంచకప్‌లో డీకే పక్కా: గావస్కర్

బెంగళూరు బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్ ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్ 15వ సీజన్‌లో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే...

Published : 12 May 2022 10:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్ ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్ 15వ సీజన్‌లో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఫినిషర్‌గా దంచికొడుతూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఎలాగైనా రాబోయే టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇదే విషయంపై బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ స్పందిస్తూ.. తాను టీమ్‌ఇండియా సెలెక్టర్‌ అయితే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తానని చెబుతున్నాడు. గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా డీకేతో కలిసి కామెంట్రీ చేశానని అన్నాడు. దీంతో అతడి ఆలోచనలేంటో తనకు తెలుసన్నాడు.

‘గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా మేమిద్దరం కలిసి కామెంట్రీ చేశాం. అంతకు ముందు క్వారంటైన్‌లో ఉన్నప్పుడు కూడా చాలా సమయం కలిసి ఉన్నాం. నాటి నుంచే అతడు మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వాలని, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని ఎంత పట్టుదలతో ఉన్నాడో నాకు తెలిసింది. గతేడాది ప్రపంచకప్‌కు ఎంపిక అవ్వకపోయినా, ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తే కచ్చితంగా జట్టులో ఉండాలి. నేను సెలెక్టర్‌ అయితే తప్పకుండా ఎంపిక చేస్తా’ అని గావస్కర్‌ చెప్పుకొచ్చాడు.

‘చాలా మంది ఫామ్‌ టెంపరరీ, క్లాస్‌ పర్మినెంట్‌ అంటారు. అలాంటప్పుడు క్లాస్‌ ప్లేయర్‌ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలి. డీకే ఇప్పుడు ఆడుతున్న తీరును బట్టి.. టీ20 ప్రపంచకప్‌లో పక్కా బ్యాట్స్‌మన్‌గా తీసుకోవాలి. కీపింగ్‌ అనేది అదనపు బాధ్యతలుగా అప్పగించాలి’ అని బ్యాటింగ్‌ లెజెండ్‌ పేర్కొన్నాడు. కాగా, 2019 వన్డే ప్రపంచకప్‌లో అవకాశం వచ్చినా కార్తీక్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తర్వాత అతడు మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వలేదు. కానీ, ఈసారి ఎలాగైనా చోటు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత సీజన్‌లో మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని