IPL 2022: పంజాబ్‌లో సరైన ఆటగాడు ఒక్కడు లేడు.. కష్టమే : గావస్కర్‌

పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో ఒక్క సరైన ఆటగాడు లేడని, అలాంటప్పుడు ఈసారి ఆ జట్టు టైటిల్‌ గెలవడం కష్టమని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు...

Updated : 24 Mar 2022 17:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో ఒక్క సరైన ఆటగాడు లేడని, అలాంటప్పుడు ఈసారి ఆ జట్టు టైటిల్‌ గెలవడం కష్టమని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. మరో రెండు రోజుల్లో ఐపీఎల్‌-15వ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్‌ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీజన్‌కు ముందు పంజాబ్‌ టీమ్‌ వేలంలో కొత్త ఆటగాళ్లతో రూపుదిద్దుకున్నా.. మ్యాచ్‌ ఫలితాలను తారుమారు చేసే ఒక్క ఆటగాడిని సొంతం చేసుకోలేకపోయిందని పేర్కొన్నాడు. దీంతో ఆ జట్టు కప్పు గెలిచే అవకాశం లేదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

మరోవైపు ఇలాంటి పరిస్థితి కూడా ఆ జట్టుకు ఉపకరిస్తుందని చెప్పడం గమనార్హం. అంచనాలు తక్కువైనప్పుడు ఆటగాళ్లపై ఒత్తిడి ఉండదని, అది ఆ జట్టుకు ఈసారి కలిసివస్తుందని గావస్కర్‌ వివరించాడు. ఆటగాళ్లపై ఒత్తిడి లేకపోతే స్వేచ్ఛగా ఆడతారని, దాంతో మంచి పరుగులు సాధిస్తారని చెప్పాడు. దీంతో పంజాబ్‌ పలు ఇతర జట్లపై ఆధిపత్యం చెలాయించి వారికి షాకిచ్చే అవకాశం ఉందన్నాడు. కానీ, టైటిల్‌ గెలవడం కష్టమన్నాడు. టీ20ల్లో నిలకడగా విజయాలు సాధించడం ముఖ్యమన్నాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌ వేలానికి ముందు పంజాబ్‌ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. అందులో ఒకరు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ కాగా, మరొకరు అర్ష్‌దీప్‌ సింగ్‌. ఇక వేలంలో శిఖర్‌ ధావన్‌, షారుఖ్‌ ఖాన్‌, హర్ప్రీత్‌ బ్రార్‌, జానీ బెయిర్‌స్టో, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, ఓడియన్‌ స్మిత్‌లాంటి ఫర్వాలేదనిపించే ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని