Sunil Gavaskar: సచిన్‌ను అధిగమించడం రూట్‌కు అంత తేలికకాదు: సన్నీ

అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్‌ తెందూల్కర్‌ టెస్టు రికార్డును ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జోరూట్‌ చేరుకోవడం కష్ట సాధ్యమని బ్యాటింగ్‌ దిగ్గజం...

Published : 15 Jun 2022 01:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్‌ తెందూల్కర్‌ టెస్టు రికార్డును ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జోరూట్‌ చేరుకోవడం కష్ట సాధ్యమని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. సచిన్‌ క్రికెట్‌కు దూరమై దాదాపు దశాబ్ద కాలం గడిచినా.. ఇప్పటికీ (15,921) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే, ఇటీవల రూట్‌ ఈ ఫార్మాట్‌లో 10 వేల పరుగుల మైలురాయి చేరుకోవడంతో పలువురు మాజీలు సచిన్‌ రికార్డును బద్దలుకొడతాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంపై స్పందించిన గావస్కర్‌ తన అభిప్రాయం వెల్లడించారు.

‘టెస్టుల్లో అత్యధిక పరుగుల పేరిట ఉన్న సచిన్‌ రికార్డును చేరుకోవడం చాలా కష్టం. అది ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. దాన్ని అధిగమించాలంటే సుమారుగా ఇంకో 6 వేల పరుగులు కావాలి. అంటే రాబోయే ఎనిమిదేళ్లలో ఏడాదికి 800 నుంచి 1000 పరుగులు కావాలి. రూట్ ప్రస్తుతం 31 ఏళ్లతో ఉన్నాడు కాబట్టి మున్ముందు కూడా ఇలాగే ఆడితే చేరుకునే అవకాశం ఉంది. ఆటగాళ్లు నిరంతరం ఆడుతూ ఉంటే ఫామ్‌ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అలాంటి సమయంలో శారీరక, మానసిక అలసట ఎదురవుతుంది. అయితే, క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే. ఒకప్పుడు రిచర్డ్‌ హ్యాడ్లీకి చెందిన 431 వికెట్ల రికార్డు ఎవరూ చేరుకోలేరని అనుకున్నాం. కానీ, అది బద్దలైంది. తర్వాత వాల్ష్‌ 519 రికార్డు కూడా. దీన్నిబట్టి ఆటలో ఏదైనా సాధ్యమని చెప్పొచ్చు. కాకపోతే వాటిని చేరడానికి చాలాచాలా కష్టపడాలి’ అని సన్నీ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని