Sunil Gavaskar: ఈ ప్రసార హక్కుల ధరలు చూస్తుంటే మతి పోతోంది : గావస్కర్‌

భారత టీ20 లీగ్‌ విలువ ఈ స్థాయికి చేరుతుందని అస్సలు ఊహించలేదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నారు...

Published : 14 Jun 2022 09:27 IST

ముంబయి: భారత టీ20 లీగ్‌ విలువ ఈ స్థాయికి చేరుతుందని అస్సలు ఊహించలేదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నారు. ముంబై వేదికగా జరుగుతోన్న ఈ వేలంలో వచ్చే ఐదేళ్లకు టోర్నీ ప్రసార టీవీ, డిజిటల్‌ హక్కులను సోమవారం రెండు వేర్వేరు సంస్థలు కొనుగోలు చేశాయి. టీవీ హక్కులు రూ.23,575 కోట్ల ధర పలకగా.. డిజిటల్‌ హక్కులు రూ.20,500 కోట్ల ధర పలికాయి. దీంతో పాటు అదనంగా మరో రూ.2 వేల కోట్లు ఖాయమయ్యాయి. దీంతో సోమవారం మొత్తం విలువ రూ.46 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాతో సన్నీ మాట్లాడాడు.

‘ఈ ప్రసార హక్కుల విలువ చూస్తుంటే భారత్‌లో ఈ లీగ్‌కు ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలుస్తోంది. 2008లో ఈ టోర్నీ ప్రారంభమైనప్పుడు 15 ఏళ్ల తర్వాత.. ఇలాంటి మ్యాజిక్‌ ఫిగర్లు (ప్రసార హక్కుల ధరలు) చూస్తాననుకోలేదు. ఇది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. మీరంతా ఈ టోర్నీని నాణ్యమైన విధంగా ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎప్పుడూ వీక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ టోర్నీని క్రికెట్‌ అభిమానులు బాగా ఆదరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసార హక్కుల కోసం వచ్చిన ధర చూస్తుంటే మతిపోతోంది’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని