T20 League : హార్దిక్‌ను చూస్తుంటే అప్పటి రోహిత్‌ గుర్తుకొస్తాడు: సునిల్ గావస్కర్‌

టీ20 లీగ్‌లో గుజరాత్‌ ప్లేఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ...

Published : 01 May 2022 01:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో గుజరాత్‌ ప్లేఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాయకత్వ నైపుణ్యంతో గుజరాత్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడని క్రికెట్‌ దిగ్గజం సునిల్ గావస్కర్‌ కొనియాడాడు. రోహిత్ శర్మ ముంబయికి తొలిసారి కెప్టెన్‌గా ఎంపికైనప్పటి రోజులను హార్దిక్‌ గుర్తు చేస్తున్నాడని పేర్కొన్నాడు. నాయకుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే బ్యాటర్‌గా చాలా వృద్ధి చెందాడని తెలిపాడు. 

‘‘ఇప్పుడు హార్దిక్‌ సారథ్యం చూస్తున్నప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ గుర్తుకొస్తుంది. టీ20 లీగ్‌ 2013 సీజన్‌ మధ్యలో ముంబయి జట్టుకు రోహిత్ నాయకత్వ బాధ్యతలను చేపట్టాడు. అప్పటి నుంచి అతడి బ్యాట్‌ నుంచి టీ20ల్లో 40లు, 50లు, 60లు చూస్తున్నాం. రోహిత్ షాట్‌ సెలెక్షన్‌ కూడా మెరుగైంది. అలాంటి పోలికలే హార్దిక్‌లోనూ మనం చూడొచ్చు. హార్దిక్‌ షాట్‌ సెలెక్షన్‌ కూడా అదిరింది. ఇద్దరూ మంచి ఫీల్డర్లే. ఇలాంటి క్వాలిటీనే గుజరాత్‌ను టాప్‌లో నిలబట్టేలా చేసింది’’ అని సునిల్ గావస్కర్‌ వివరించాడు. గత సీజన్‌ వరకు ముంబయి తరఫునే కొనసాగిన హార్దిక్‌ పాండ్యను రిటెయిన్‌ చేసుకోకపోవడంతో మెగా వేలంలోకి వెళ్లాడు. అయితే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్‌ హార్దిక్‌ను ముందే తీసేసుకొని కెప్టెన్‌గా నియమించుకుంది. ప్రస్తుతం ఎనిమిది మ్యాచుల్లో ఏడు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో గుజరాత్ (14) టాప్‌ స్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని