IND vs SL: రోహిత్‌.. ఆ షాట్‌ ఆడొద్దు..: గావస్కర్‌

టెస్టుల్లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు శుభారంభం లభించింది. అతడి నాయకత్వంలో ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా.. ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ

Published : 12 Mar 2022 01:37 IST

ఇంటర్నెట్ డెస్క్: టెస్టుల్లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు శుభారంభం లభించింది. అతడి నాయకత్వంలో ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా.. ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా విజయవంతమైనా.. ఆటగాడిగా మాత్రం విఫలమయ్యాడు. తాను ఎదుర్కొన్న మొదటి రెండు బంతులను బౌండరీకి పంపిన హిట్‌మ్యాన్‌ తొలుత ఊపు మీద కనిపించాడు. కానీ, 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుల్‌ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అయితే, పుల్‌ షాట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన రోహిత్‌ శర్మకు.. అదే షాట్‌ బలహీనంగా మారిందని భారత మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

మార్చి 12 నుంచి బెంగళూరు వేదికగా శ్రీలంకతో రెండో టెస్టు (డే/నైట్‌, గులాబీ బంతి) జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మకు సునీల్‌ గావస్కర్‌ కీలక సూచనలు చేశాడు. ‘రోహిత్‌ శర్మకు పుల్‌ షాట్ అంటే ఎంతో ఇష్టం. అతడు దూకుడుగా ఆడటం మొదలెట్టిన ప్రతిసారీ ఎక్కువగా ఆ షాట్లే ఆడుతున్నాడు. ఒక బ్యాటర్‌ తనకు అలవాటైన షాట్‌ను ఆడుతున్నాడంటే బౌలర్లు ఆ విషయాన్ని పసిగట్టి ఆ బలాన్నే బలహీనతగా మార్చే ప్రయత్నం చేస్తారు. పదేపదే అదే షాట్‌ ఆడడం మంచిది కాదు. రోహిత్‌ వేరే షాట్లు కూడా ఆడగలడు. ప్రతిసారీ ఫుల్‌ షాట్లు ఆడటానికి ప్రయత్నించి పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు. తన చివరి నాలుగు టెస్టుల్లో ఒక్క అర్ధసెంచరీ కూడా లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రతిసారీ ఆ షాట్‌ అతడికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అందుకే 80, 90, 100 పరుగులు సాధించే వరకు పుల్‌షాట్‌ జోలికెళ్లకపోవడం మంచిది’’ అని సునీల్‌ గవాస్కర్‌ సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని