Virat Kohli: స్పిన్‌ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బౌల్డ్‌.. అలా ఆడితే బాగుండేది: గావస్కర్‌

టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో (IND vs NZ) విఫలమై నిరాశపరిచాడు. స్పిన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడం అభిమానులకు రుచించలేదు.

Published : 19 Jan 2023 13:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రీలంకపై రెండు శతకాలు బాది అదరగొట్టేసిన విరాట్ కోహ్లీ.. ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో మాత్రం తేలిపోయాడు. కేవలం 8 పరుగులకే పెవిలియన్‌కు చేరి అభిమానులను నిరాశపరిచాడు. మిచెల్‌ సాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో కోహ్లీ ఔట్‌ కావడంపై క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సాంట్నర్ వేసిన స్ట్రెయిట్‌ డెలివరీని ఆడటంలో విఫలం కావడం సరికాదని పేర్కొన్నాడు. 

‘‘వికెట్ల లైన్‌కు లోపలగా విరాట్ కోహ్లీ ఆడటంతోనే సాంట్నర్ బంతి వికెట్లను గిరాటేసింది. అతడు బంతిని బ్యాక్‌ ఫుట్‌ వేసి ఆడేందుకు ప్రయత్నించాడు. అదే ముందుకు ఆడి ఉంటే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొనేవాడు. అదేమీ మరీ వికెట్ల ముందు పడిన బంతి కాదు. అయితే, కాస్త టర్న్‌ విరాట్ కోహ్లీ బౌల్డ్‌ కావాల్సి వచ్చింది’’ అని గావస్కర్‌ తెలిపాడు. స్టార్‌ బ్యాటర్లు త్వరగా పెవిలియన్‌కు చేరినప్పటికీ యువ బ్యాటర్ శుబ్‌మన్‌ గిల్ (208) డబుల్ సెంచరీ  బాదడంతో న్యూజిలాండ్‌పై భారత్‌ 349/8 భారీ స్కోరు సాధించింది. అనంతరం మైకెల్‌ బ్రాస్‌వెల్ (140) భయపెట్టినా.. సిరాజ్‌ (4/46) సూపర్‌ బౌలింగ్‌ ప్రదర్శనతో కివీస్‌ను 337 పరుగులకు ఆలౌట్‌ చేసి 12 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని