Thomas Cup: భారత బ్యాడ్మింటన్‌కు ఇది ‘1983’ లాంటిది : గావస్కర్‌

ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలను నెరవేరుస్తూ భారత్‌ చరిత్ర సృష్టించింది.

Published : 17 May 2022 01:58 IST

ముంబయి: ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. భారత్‌ చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌లో జయకేతనం ఎగరవేసింది. చిరస్మరణీయ ప్రదర్శనతో టీమిండియా.. 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాను చిత్తు చేసింది. లక్ష్యసేన్‌ నుంచి కిదాంబి శ్రీకాంత్‌ వరకూ అందరూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ విజయంపై ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. క్రీడాకారులపై పలువురు దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ గావస్కర్‌ ఆటగాళ్లను ఆకాశానికెత్తారు. క్రికెట్‌లో భారత్‌ తొలిసారి ప్రపంచకప్‌ సాధించిన ‘1983’ అద్భుత క్షణాలతో ఈ విజయాన్ని పోల్చారు. నిన్న లఖ్‌నవూ-రాజస్థాన్‌ మ్యాచ్‌కు ముందు ఆయన ఈ విజయంపై స్పందించారు.

‘సైమండ్స్‌ మరణ వార్తతో ఈ ఉదయం చాలా బాధాకరంగా గడిచింది. అయితే.. మధ్యాహ్నానికల్లా శుభవార్త వచ్చేసింది. థామస్‌ కప్‌ విజేతగా భారత్‌ నిలిచింది. 14 ఏళ్ల ఛాంపియన్‌ను మట్టికరిపించి తొలిసారి భారత్‌ టైటిల్‌ను మద్దాడింది. ఈ విజయంతో నేను ఆకాశంలో తేలుతున్నట్లు అనిపించింది. నేను బ్యాడ్మింటన్‌ను ప్రేమిస్తాను. ఎంతలా అంటే.. టీ20 క్రికెట్‌, బ్యాడ్మింటన్‌లో ఏదో ఒకటి చూడాలని నాకు ఛాయిస్‌ ఇస్తే.. నేను తప్పకుండా బ్యాడ్మింటన్‌నే ఎంచుకుంటాను’

‘భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఇదో అద్భుతమైన రోజు. భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌(1983) గెలిచిన రోజుతో ఈ విజయాన్ని పోల్చవచ్చు. ఎందుకంటే అప్పుడు ఇండియా కప్‌ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఆ విజయం తర్వాత భారత్‌లో క్రీడలకు అద్భుత ఆదరణ లభించింది. అయితే.. ఇక్కడ భారత్‌ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదని నేను అనను. గత రెండేళ్లుగా భారత్‌ అద్భుతమైన బ్యాడ్మింటన్‌ జట్టును రూపొందించింది. కానీ, 14 ఏళ్ల ఛాంపియన్‌తో తలపడుతుండటంతో ఏ మూలనో కాస్త సందేహం. ఈ విజయం వాటిని పటాపంచలు చేసింది. నన్ను అమితానందానికి గురిచేసింది. ప్రస్తుతం నేను ఆనందంతో చంద్రుడిపై, సూర్యుడిపైనే కాదు.. అన్ని గ్రహాలపై ఉన్నట్లుంది’ అని గావస్కర్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని