IND vs AUS: విరాట్‌ ఔట్‌.. గావస్కర్‌ తీవ్ర అసంతృప్తి!

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌ చేతిలో భారత్‌ (IND vs AUS) ఘోర పరాజయం చవిచూసింది. అయితే, దీనికంటే అభిమానులను బాధించే మరో అంశం ఉంది. ఇద్దరు బ్యాటర్లు గత మ్యాచ్‌ మాదిరిగానే ఔట్‌ కావడంపై విమర్శలు రేగాయి. అందులో ఒకరు విరాట్ కాగా.. మరొకరు సూర్యకుమార్‌ యాదవ్‌ కావడం గమనార్హం.

Published : 20 Mar 2023 01:38 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో (IND vs AUS) ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.  తొలి వన్డేలో 4 పరుగులు, రెండో వన్డేలో 31 పరుగులు చేశాడు. రెండుసార్లూ ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరడం గమనార్హం. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓవైపు వికెట్లు పడినా నిలకడగా ఆడినట్లు కనిపించాడు. తీరా, మరోసారి తన బలహీనతను బయటపెట్టుకుని ఆసీస్‌ బౌలర్ ఎల్లిస్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ ఔటైన తీరుపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి వన్డేలో మాదిరిగానే రెండో మ్యాచ్‌లోనూ ఔట్‌ కావడం సరైంది కాదని పేర్కొన్నాడు.

‘‘విరాట్ మరోసారి లైన్‌ను దాటేసి ఆడాడు. చేసిన తప్పేంటో కోహ్లీకి తెలుసు. ఇటీవల చాలా మ్యాచుల్లో ఇలానే ఔటై పెవిలియన్‌కు చేరాడు. స్క్వేర్‌ లెగ్‌ వైపు ఆడేందుకు ప్రయత్నించడం వల్లే ఇలా జరుగుతోంది. మిడ్‌ఆన్‌ మీదుగా కూడా ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే, ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదు’’ అని గావస్కర్‌ తెలిపాడు. మిచెల్‌ స్టార్క్‌ విజృంభించడంతో భారత్‌ 117 పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఆసీస్‌ కేవలం 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. 

సూర్య ఔట్‌పై కోహ్లీ..

స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. తొలి బంతికే స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. మొదటి వన్డేలోనూ స్టార్క్‌ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండుసార్లూ సూర్యకుమార్‌ ఒకేలా ఔట్‌ కావడంపై నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, విరాట్ కోహ్లీ కూడా గత మ్యాచ్‌ మాదిరిగానే ఎల్బీగా ఔట్‌ కావడం గమనార్హం. కనీసం డీఆర్‌ఎస్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని