IND vs SA : లంచ్ బ్రేక్‌ తర్వాత.. భారత్ వ్యూహాలేంటో అర్థం కాలేదు : సునీల్‌ గావస్కర్‌

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అనుసరించిన వ్యూహాలపై మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా లంచ్...

Published : 15 Jan 2022 01:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అనుసరించిన వ్యూహాలపై మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా లంచ్ బ్రేక్‌ తర్వాత కోహ్లీ అమలు చేసిన ప్రణాళికల్లో లోపాలున్నాయని పేర్కొన్నాడు.

‘నాలుగో రోజు భోజన విరామం తర్వాత శార్దూల్ ఠాకూర్‌, బుమ్రాలతో ఎందుకు బౌలింగ్‌ చేయించలేదో ఇప్పటికీ అంతుపట్టడం లేదు. బహుశా కోహ్లీసేన కచ్చితంగా ఓడిపోతామని ముందే నిర్ణయించుకున్నట్లుంది. మరో వైపు, స్పిన్నర్‌ అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తుంటే.. ఫీల్డర్లను కూడా సరైన ప్రాంతాల్లో మోహరించలేదు. ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేసేందుకు అదొక్కటే మార్గమన్నట్లు డీప్‌ వికెట్‌లోనే ఐదుగురు ఫీల్డర్లను ఉంచారు. అలా చేయడం వల్ల బ్యాటర్లకు సులభంగా సింగిల్స్‌ తీసేందుకు అవకాశమిచ్చినట్లయింది. చివరి రెండు టెస్టులు జరిగిన జొహాన్నెస్ బర్గ్‌, కేప్‌ టౌన్‌ల్లోని పిచ్‌లు సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించవు. అయినా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గొప్ప పోరాట పటిమతో రాణించారు. గెలవాలనే దృఢ సంకల్పంతో వారు రాణించిన తీరు ప్రశంసనీయం’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.

నాలుగో రోజు లంచ్ బ్రేక్‌ సమయానికి దక్షిణాఫ్రికా 171/3 స్కోరుతో నిలిచింది. అప్పటికీ ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 41 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, లంచ్ తర్వాత ఉమేశ్‌ యాదవ్, రవిచంద్రన్‌ అశ్విన్‌లతో బౌలింగ్ చేయించడంతో సఫారీ జట్టు 8.1 ఓవర్లలోనే మిగతా 41 పరుగులు రాబట్టి ఘన విజయం సాధించింది. మంచి లయతో బౌలింగ్‌ చేస్తున్న బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌లను కాదని ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌లతో బౌలింగ్‌ చేయించడాన్ని సునీల్ గావస్కర్‌ తప్పు పట్టాడు. ఇదిలా ఉండగా, మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని