
IND vs SA : ఆ సమయంలో కేఎల్ రాహుల్ వ్యూహాలేంటో అర్థం కాలేదు: గావస్కర్
ఇంటర్నెట్ డెస్క్: తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సరైన ప్రణాళికలను కెప్టెన్ కేఎల్ రాహుల్ అమలు చేయలేదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. సఫారీల జట్టు సారథి టెంబా బవుమా- డస్సెన్ జంట 204 పరుగులను జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలను నమోదు చేశారు. ప్రమాదకరంగా మారిన భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు బుమ్రా, భువనేశ్వర్‌తో ఎక్కువ ఓవర్లు వేయిస్తే బాగుండేదని గావస్కర్ విశ్లేషించాడు. అంతేకాకుండా వెంకటేశ్ అయ్యర్‌తో బౌలింగ్ చేయించాల్సిందని పేర్కొన్నాడు. దీని కోసం కేఎల్ రాహుల్ ఆలోచనల్లో కూరుకుపోయినట్లుగా ఉందని తెలిపాడు.
‘‘ప్రత్యర్థి జట్టు నుంచి మంచి భాగస్వామ్యం నమోదైనప్పుడు.. ఎలాంటి కెప్టెన్‌కైనా ఆలోచించడం కష్టమే. తొలి వన్డేలో ఏం జరింగిందో అర్థమైంది. ఆ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. బ్యాట్ మీదకు బంతి చాలా సులువుగా వచ్చింది. అయితే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లు భారత్ సొంతం. బుమ్రా, భువనేశ్వర్‌కు కనీసం ఐదారు ఓవర్లు ఉంచాల్సింది. భారీ స్కోరు సాధించకుండా ఆతిథ్య జట్టును అడ్డుకునేందుకు రాహుల్ వద్ద ఉన్న వ్యూహాలు ఏంటో కూడా తెలియలేదు. అంతర్జాతీయ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. కాబట్టి వచ్చే మ్యాచ్‌ల్లో జట్టును విజయవంతంగా నడిపిస్తాడని ఆశిద్దాం’’ అని సునిల్ గావస్కర్ వివరించాడు.
దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ (79) చక్కని ఇన్నింగ్స్ ఆడాడని గావస్కర్ అభినందించాడు. ‘‘ధావన్ విషయానికొస్తే.. 50 ఓవర్ల గేమ్‌లో నిలకడగా పరుగులు చేస్తుంటాడు. పొట్టి ఫార్మాట్లో అంతగా రాణించలేడు. అందుకే రన్స్ చేసేంతవరకు బ్యాక్‌గ్రౌండ్‌ను హోల్డ్‌లో పెట్టేయాల్సిందే. ఇక అతడి వయస్సు, ఫిట్నెస్ వంటి వాటిపై మాట్లాడకూడదు’’ అని వ్యాఖ్యానించాడు.