IND vs AUS: ‘కోహ్లీ డబుల్ సెంచరీ చేస్తే భారత్‌ విజయం సాధించే అవకాశం’

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అర్ధ  శతకం బాదాడు. ఈ హాఫ్‌ సెంచరీని అతడు డబుల్ సెంచరీగా మలుస్తాడని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 12 Mar 2023 01:42 IST

అహ్మదాబాద్‌:  టీమ్‌ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టెస్టుల్లో విఫలమైన అతడు నాలుగో టెస్టులో మాత్రం రాణిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం బాదాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 59 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దాదాపు 14 నెలల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఆటతీరు గురించి భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) మాట్లాడాడు. కోహ్లీ ఈ అర్ధశతకాన్ని డబుల్‌ సెంచరీగా మరల్చుతాడని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ కోహ్లీ ద్వి శతకం సాధిస్తే భారత్ ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పాడు.

‘పిచ్‌ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని అర్థం చేసుకుని  విరాట్‌ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం గొప్ప విషయం. ఈ అర్ధ సెంచరీ డబుల్ సెంచరీగా మారే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అదే జరిగితే ఆస్ట్రేలియాపై భారత్ ఆధిక్యం సాధించడంతోపాటు మ్యాచ్‌లో భారత్‌ గెలిచే అవకాశం ఉంది’ అని గావస్కర్ వివరించాడు. కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడని, ఫామ్‌ లేమి నుంచి బయటపడటానికి ఇది మంచి అవకాశమని ఆయన చెప్పాడు. ‘ఎవరైనా ఆకలితో ఉండి సరిపడా తిననప్పుడు.. తినడానికి ఏదైనా దొరికితే ఎందుకు వదిలేయాలి? కోహ్లీ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. అతడు గత కొన్నేళ్లుగా సెంచరీ చేయలేదు. కాబట్టి దాన్ని భర్తీ చేయడానికి 250 పరుగులు చేయడం ఉత్తమ మార్గం’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

ఆసీస్‌తో నాలుగో టెస్టు విషయానికొస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కోహ్లీ (59), రవీంద్ర జడేజా (16) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 480 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని