Sunil Gavaskar: రాహుల్‌ అలా ఎందుకు చేస్తాడో అర్థంకాలేదు: గావస్కర్

లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెవులు మూసుకొని సెలబ్రేట్‌ చేసుకోవడం ఏంటో తనకు అర్థం కాలేదని టీమ్‌ఇండియా...

Published : 19 Apr 2022 02:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెవులు మూసుకొని సెలబ్రేట్‌ చేసుకోవడం ఏంటో తనకు అర్థం కాలేదని టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ఆదివారం ముంబయితో తలపడిన మ్యాచ్‌లో రాహుల్‌ (103*) శతకం బాదిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతడు వంద పరుగులు పూర్తి చేయగానే బ్యాట్‌ కిందపెట్టి రెండు చేతులతో తన చెవుల్నీ మూసుకొని కళ్లు మూసుకొని కాసేపు మౌనంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గావస్కర్‌ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించాడు.

‘ఇది నాకు ఏ మాత్రం అర్థంకావడంలేదు. రాహుల్‌ తన చెవుల్ని మూసుకొని బయట నుంచి వచ్చే శబ్దాల్ని వినకుండా చేస్తున్నాడు. కానీ, శతకం బాదినప్పుడు ప్రజల నుంచి వచ్చే అభినందనలు, గౌరవాన్ని స్వీకరించాలి. అలా చెవుల్ని మూసుకోవడం ఎప్పుడు చేయాలంటే అతడు 4, 5, 6 అలా తక్కువ పరుగులు చేసినప్పుడు మూసుకుంటే బాగుంటుంది. ఇలా సెంచరీ చేసినప్పుడు కాదు. అతడు అలా చేతుల్ని తీసి అభిమానుల కేరింతలు, సంతోషాన్ని ఆస్వాదించాలి’ అని గావస్కర్‌ వివరించాడు. కాగా, రాహుల్‌ గతంలోనూ టీమ్‌ఇండియా తరఫున ఆడేటప్పుడు ఇలా చెవులు మూసుకొని సెలబ్రేట్‌ చేసుకొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే, అతడు ఫామ్‌లో లేనప్పుడు వచ్చే విమర్శలకు దీటుగా ఇలా చేస్తాడని టాక్‌.

మరోవైపు ముంబయితో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ విజయం సాధించడంతో ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అలాగే కేఎల్‌ రాహుల్‌ సైతం ఈ శతకంతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఆ జట్టు మంగళవారం బెంగళూరుతో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని