WTC Final: న్యూజిలాండ్‌కు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు: సునీల్ గావస్కర్

న్యూజిలాండ్‌ జట్టు శ్రీలంకను ఓడించి భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడానికి  పరోక్షంగా లాభం చేకూర్చిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 14 Mar 2023 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినప్పటికీ.. టీమ్‌ఇండియా (Team India) డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌ ఫలితం తేలకముందే.. న్యూజిలాండ్‌ చేతిలో లంక ఓటమితో రోహిత్‌ సేన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)కు చేరింది. శ్రీలంకను ఓడించి భారత్‌కు న్యూజిలాండ్‌ పరోక్షంగా లాభం చేకూర్చిందనే చర్చ జరుగుతోంది. కొంతమంది భారత అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కివీస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్‌కు భారత్ రుణపడి లేదని, కివీస్‌కు ఎలాంటి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదని  అభిప్రాయపడ్డారు. టీమ్‌ఇండియా ఎవరి సహాయంతోనో కాకుండా.. రెండేళ్లుగా అద్భుతమైన ఆటతీరు కనబర్చి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిందని ఆయన పేర్కొన్నారు. 

‘న్యూజిలాండ్‌కు భారత్‌ ఏమీ రుణపడి ఉంటుందని నేను అనుకోను. మీరు ఏం చెప్పినా.. పాయింట్ల పట్టికలో నంబర్‌ 2గా ఉండటానికి, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడానికి భారత్‌ గత కొంతకాలంగా అత్యుత్తమ క్రికెట్ ఆడింది. శ్రీలంకపై కివీస్‌ గెలిచింది బాగానే ఉంది. ఇది న్యూజిలాండ్ క్రికెట్‌కు మంచిది. కానీ, భారత క్రికెట్ న్యూజిలాండ్‌కు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి గత రెండేళ్లలో టీమ్‌ఇండియా చాలా అత్యుత్తమ క్రికెట్ ఆడింది. అందువల్లే వారు ఎవరి సహాయంతో కాకుండా వారి సొంతంగానే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించారు’ అని సునీల్ గావస్కర్‌  ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జూన్‌ 7-11 మధ్య లండన్‌లోని ది ఓవెల్ మైదానంలో  (WTC Final)ను నిర్వహించనున్నారు. జూన్‌ 12 తేదీని రిజర్వ్‌ డేగా ప్రకటించారు. ఈ మెగా పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు