Sunil Gavaskar: ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ను పక్కనబెట్టారా?.. గావస్కర్‌ అసహనం

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన సీనియర్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను రెండో టెస్టుకు తీసుకోకపోవడంతో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అసహనం వ్యక్తం చేశారు.

Published : 23 Dec 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టు (Test Match) మ్యాచ్‌కు సీనియర్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)ను పక్కనబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన కుల్‌దీప్‌ను తప్పించి.. ఆ స్థానంలో జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీనిపై టీమ్‌ఇండియా (Team India) మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) స్పందిస్తూ.. జట్టు మేనేజ్‌మెంట్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించాడు.

‘‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను జట్టు నుంచి తొలగించడం నమ్మశక్యంగా లేదు. ఈ సమయంలో నేను చెప్పగలిగే ఒకే ఒక్క మాట ఇది. నేను చాలా తీవ్రమైన పదాలే ఉపయోగించొచ్చు.. కానీ తొలి టెస్టులో మొత్తం 20 వికెట్లకు 8 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిని పక్కనబెట్టడం నాకు అస్సలు నమ్మశక్యంగా అన్పించట్లేదు’’ అని ఓ మీడియా ఛానల్‌కు కామెంట్రీ చేస్తూ గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. అయితే కుల్‌దీప్‌ కాకుండా జట్టులో మరో ఇద్దరు స్పిన్నర్లు (అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌) ఉన్నారని, వారిలో ఎవరో ఒకరిని తొలగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. కుల్‌దీప్‌ను జట్టు నుంచి తప్పించడంపై సోషల్‌మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి.

కాగా.. అంతకుముందు టాస్‌ సందర్భంగా తాత్కాలిక సారథి కేఎల్‌ రాహుల్‌ (Kl Rahul) మాట్లాడుతూ.. కుల్‌దీప్‌ను పక్కనబెట్టడం కఠినమైన నిర్ణయమే అని అన్నాడు. అయితే అన్ని రకాల బౌలింగ్‌ దళాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతోనే అలా చేశామన్నాడు. ‘‘కుల్‌దీప్‌ను వదులుకోవడం దురదృష్టకరమైన నిర్ణయమే. కానీ ఉనద్కత్‌కు ఓ మంచి అవకాశం’’ అని రాహుల్‌ తెలిపాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించడంలో కుల్‌దీప్‌ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు,  రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్‌లో రాణించి కీలకమైన 40 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే రెండో టెస్టులో అతడిని తప్పించి.. లెఫ్టార్మ్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ (Jaydev Unadkat)ను జట్టులోకి తీసుకున్నారు. 12 ఏళ్ల తర్వాత తన రెండో టెస్టు ఆడుతున్న ఈ సీనియర్‌ పేసర్‌.. తాజా మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని