Rohit - Gavaskar: ప్రపంచకప్‌ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్‌ తీరుపై గావస్కర్‌ అసహనం

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కుటుంబ బాధ్యతల కారణంగా భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి తీరుపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Published : 24 Mar 2023 01:40 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) తీరుపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) అసహనం వ్యక్తం చేశాడు. కుటుంబ బాధ్యతల కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేకు  రోహిత్‌ దూరమయ్యాడు. దీంతో హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌ ఆడి విజయం సాధించిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) ముంగిట కుంటుంబ బాధ్యతల పేరుతో రోహిత్‌ మ్యాచ్‌కు దూరంగా ఉండడం సరికాదని గావస్కర్‌ అన్నాడు. నాయకత్వంలో కొనసాగింపు ఉండాలన్నాడు.

‘‘రోహిత్‌ శర్మ టీమ్‌ఇండియా సారథి. అతడు కచ్చితంగా అన్ని మ్యాచులు ఆడాలి. కుటుంబ బాధ్యత వల్ల అతడు అక్కడ ఉండాల్సి వచ్చిందని నాకు తెలుసు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ కేవలం ఒక్క మ్యాచ్‌కోసం జట్టు కెప్టెన్‌గా వ్యవహరించేవారు ఎక్కడా ఉండరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఏ ఇతర ఆటగాడికైనా జరగొచ్చు. నాయకత్వంలో కొనసాగింపు ఉండాలి. అది జట్టుకు చాలా అవసరం. అప్పుడే అందరూ నీతో ఉన్నారన్న భావన నీకు కలుగుతుంది. అప్పుడే జట్టును సమర్థంగా ముందుకు నడిపించవచ్చు. లేదంటే ఒక జట్టుకు ఇద్దరు నాయకులుంటారు. జట్టు సభ్యులు ఇద్దరు నాయకుల కోసం ఎదురుచూస్తారు. అది జట్టుకి ఎంతమాత్రం మంచిది కాదు. వన్డే ప్రపంచ కప్‌ ప్రారంభమైతే మీరు కుటుంబ బాధ్యతలు నిర్వహించలేరు. అత్యవసర పరిస్థితులు మినహా మిగతా ఏ పనులున్నా టోర్నమెంట్‌కు ముందే పూర్తి చేసుకోండి’’ అని గావస్కర్‌ సూచించాడు.

తొలి వన్డే తర్వాత జరిగిన రెండు మ్యాచులకు రోహిత్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కానీ రెండింట్లోనూ భారత్‌ ఓటమినే చవిచూసింది. బుధవారం భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ చేజిక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని