Rahul Dravid: ద్రవిడ్‌కు ‘భారతరత్న’ ఇవ్వడమే సముచితం: సునీల్ గావస్కర్

భారత్ టీ20 ప్రపంచ కప్‌ నెగ్గడంలో రోహిత్‌తోపాటు జట్టులోని సభ్యులు ఎంత కష్టపడ్డారో.. కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్ శ్రమ కూడా అంతే కీలకం.

Updated : 07 Jul 2024 16:20 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా తన మూడేళ్ల పదవీకాలాన్ని ఇటీవలే ముగించాడు. టీ20 ప్రపంచ కప్‌ను (Team India) రెండోసారి ముద్దాడాలనే సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అలాగే దాదాపు 11 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ నాయకత్వాన భారత్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. జూన్ చివరితో కోచ్‌ బాధ్యతలను రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) ముగించాడు. ఈ క్రమంలో అతడిని భారత రత్నతో కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తే బాగుంటుందని క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘ద్రవిడ్‌ను భారతరత్న బిరుదుతో సత్కరిస్తే సముచితంగా ఉంటుందనే నా అభిప్రాయం. గొప్ప కెప్టెన్, గొప్ప ఆటగాడిగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లాండ్‌లోనూ టెస్టు సిరీస్‌లను గెలిచిన ముగ్గురు కెప్టెన్లలో ఒకడు. జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్‌గా (NCA) కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాడు. సీనియర్‌ జట్టుకు కోచ్‌గానూ అద్భుత ఫలితాలు రాబట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో కొందరు నాయకులకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించింది. సమాజానికి వారు చేసిన సేవలకు అందించింది. ఇప్పుడు ద్రవిడ్‌ సాధించిన లక్ష్యాలు కూడా అన్ని వర్గాలను అలరించాయి. అందుకే దేశంలోనే అత్యున్నత పురస్కారం అందుకోవడానికి ద్రవిడ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేందుకు నాతో కలుస్తారని ఆశిస్తున్నా. రాహుల్‌ శరద్‌ ద్రవిడ్‌.. భారత రత్న (Bharat Ratna).. ఈ మాట వింటుంటేనే అద్భుతంగా అనిపిస్తోంది.

ఇప్పుడు ప్రధాన కోచ్‌గా ఆటగాళ్లను ముందుండి నడిపించాడు. అయితే, తన కెరీర్‌లోనూ ఎప్పుడూ స్వార్థంతో ఆడలేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించాడు. డే ముగింపు రోజులోనూ వికెట్‌ పడితే బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండేవాడు. అంతా నైట్‌వాచ్‌మన్‌గా పిలుస్తారు. కానీ, అతడి విషయంలో మాత్రం ఆ పదం సరికాదు. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్ ఎవరూ ఆ చివరి నిమిషాల్లో ఆడేందుకు ఆసక్తి చూపించరు. ఈసారి వరల్డ్‌ కప్‌లోనూ భారత్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. అలాంటప్పుడు కూడా నిశ్శబ్దంగా ఆటగాళ్లను నడిపించిన తీరు బాగుంది’’ అని గావస్కర్‌ (sunil Gavaskar) తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని