WTC Finals: బాక్స్‌లోనూ డీకే అదరగొడతాడు

టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ మరికొద్ది రోజుల్లో కొత్త అవతారం ఎత్తనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో దిగ్గజ క్రికెటర్‌, వ్యాఖ్యాత సునీల్‌ గావస్కర్‌ సరసన మరో వ్యాఖ్యాతగా అలరించనున్నాడు.

Updated : 05 Jun 2021 21:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ మరికొద్ది రోజుల్లో కొత్త అవతారం ఎత్తనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో దిగ్గజ క్రికెటర్‌, వ్యాఖ్యాత సునీల్‌ గావస్కర్‌ సరసన మరో వ్యాఖ్యాతగా అలరించనున్నాడు. ఇప్పటికే డీకేతో కలిసి సెర్బియాలో క్వారంటైన్‌లో ఉన్న గావస్కర్‌ తాజాగా అతడితో కలిసి దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని, సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్న డీకేకు శుభాకాంక్షలు చెప్పాడు.

‘నేను టీమ్‌ఇండియాకు కన్‌సల్టెంట్‌గా ఉన్న రోజుల్లో దినేశ్‌ కార్తీక్‌ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో క్రికెట్‌ వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నాడు. కామెంట్రీ బాక్స్‌లోనూ అతడు అదరగొడతాడని నేను కచ్చితంగా నమ్ముతున్నా. గుడ్‌లక్‌ డీకే’ అని పేర్కొంటూ గావస్కర్‌ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దీనికి స్పందించిన డీకే.. మీ పక్కన కూర్చొని పనిచేయడం నా అదృష్టం. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని బదులిచ్చాడు.

ప్రస్తుతం దినేశ్‌ కార్తీక్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడకపోయినా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తరఫున చివరిసారి ఆడాడు. కీలకమైన సెమీఫైనల్స్‌లో అందరిలాగే విఫలమై తర్వాత జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు గతేడాది ఐపీఎల్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకొని ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో వ్యాఖ్యాతగా ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని