Virat Kohli: పొట్టికప్‌లో విరాట్‌కు ఏమైంది..? మదనపడుతున్న మాజీలు, ఫ్యాన్స్‌

కింగ్‌ కోహ్లీ తాజాగా ఆస్ట్రేలియాపై డకౌట్‌ కావడంతో అతడి ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకొన్నాడు. సెమీస్‌కు ముందు అతడి ఫామ్‌ జట్టు యాజమాన్యంలో కూడా ఆందోళన పెంచుతోంది.

Updated : 25 Jun 2024 13:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన శైలికి భిన్నంగా ఆడటానికి ప్రయత్నించి విరాట్‌ మరోసారి డకౌట్‌ కావడంతో అతడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కెరీర్‌లో అతితక్కువసార్లు మాత్రమే పరుగులు చేయకుండా అతడు పెవిలియన్‌ చేరుకొన్నాడు. ఈ క్రమంలో అతడు బ్యాటింగ్‌ను గమనించిన సీనియర్లు ఓ లోపాన్ని గుర్తించారు. రానున్న కీలక మ్యాచుల్లో దానిని అతడు సరి చేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఓపెనింగ్‌ అతడికి కలిసిరావడం లేదని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. తిరిగి నెంబర్‌ 3 ప్లేస్‌లోకి వెళ్లాలని కోరుతున్నారు. 

ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు..

విరాట్‌ కోహ్లీ తాజాగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా డకౌట్‌ అయి వెనుదిరిగాడు. అతడు విలువైన ఐదు బంతులను వృథా చేశాడన్న విమర్శలు చెలరేగాయి. కోహ్లీ ఈ టోర్నీలో పరుగులు ఏమీ చేయకుండా పెవిలియన్‌కు చేరడం ఇది రెండోసారి కాగా.. గత ఎనిమిది ఇన్నింగ్స్‌లో మూడోసారి. ఇది అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. అంతకుముందు 107  టీ20 ఇన్నింగ్సుల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే డకౌట్‌ అయ్యాడు. ఈ గణంకాలు చూస్తే పొట్టి ఫార్మాట్‌లో కింగ్‌ కొంత ఇబ్బందిపడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆసీస్‌ మ్యాచ్‌లో హెజిల్‌ వుడ్‌ బౌలింగ్‌లో అనవసరమైన పుల్‌ షాట్‌కు యత్నించి వికెట్‌ చేజేతులా సమర్పించుకొన్నాడు. ఒకే పొట్టి ప్రపంచకప్‌లో రెండుసార్లు డకౌట్‌ అయిన ద్వితీయ భారత బ్యాటర్‌గా చెత్త రికార్డును సొంతం చేసుకొన్నాడు. ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడు మాజీ బౌలర్‌ ఆశీష్‌ నెహ్రా.  ఈ టోర్నీలో విరాట్‌ స్కోర్లు 1, 4, 0, 24, 37, 0. 

అతడి ఆటలో అదే మిస్సయింది..

మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ కోహ్లీ ఆటతీరును తప్పుపట్టాడు. పిచ్‌పై అతడు కొంత సమయం గడిపితే కుదుటపడతాడని పేర్కొన్నాడు. ‘‘అతడు బార్బడోస్‌లో ఆడినప్పుడు గమనించడం.. బాల్‌ బ్యాట్‌కు మధ్యభాగంలో కనెక్ట్‌ అయ్యింది. అలానే ఆంటిగ్వాలో కూడా. ఐపీఎల్‌లో ఓ టెక్నికల్‌ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అతడు మైదానంలోకి దిగిన ప్రతిసారీ చాలా కుదురుగా ఆడాడు. ఇక్కడ మాత్రం అంత బ్యాలెన్స్‌గా లేడు అనిపిస్తోంది. అందుకే బంతి అతడిని బీట్‌ చేసిన ప్రతిసారీ స్టంప్స్‌ మీదకు వెళుతోంది, లేదా బ్యాట్‌కు సరైన స్థానంలో కనెక్ట్‌ కావడంలేదు.

అతడు ఔటైన షాట్లను చూడండి. ఆంటిగ్వాలో, బంగ్లాదేశ్‌పై ఆడిన మ్యాచ్‌ల్లో గమనించండి. అతడి బ్యాలెన్స్‌ సరిగ్గా లేదు. ఆ రెండుచోట్ల అతడు వికెట్‌ పోగొట్టుకొన్న తీరు చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. అతడు బ్యాలెన్స్‌ సాధిస్తే ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడు ఎంత ఎక్కువసేపు పిచ్‌పై గడిపితే అంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’’ అని ఓ ఆంగ్ల స్పోర్ట్స్‌ ఛానల్‌లో గావస్కర్‌ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో కుదురుకుంటున్నట్లు కనిపించినా.. తన్జీమ్‌ హసన్‌ షకీబ్‌ వేసిన బంతిని ఆడటానికి ప్రయత్నించి విరాట్‌ వికెట్‌ పోగొట్టుకొన్నాడు. ‘ఆ బంతిని ఇన్‌సైడ్‌ ఔట్‌ షాట్‌ కొట్టాలనుకున్నాడా ఏంటీ..?’ అని గావస్కర్‌ ప్రశ్నించాడు.

ఓపెనింగ్‌ వద్దంటున్న నెటిజన్స్‌.. 

విరాట్‌ కోహ్లీ పొట్టి ప్రపంచకప్‌లో వరుసగా స్వల్ప స్కోర్లు చేస్తుండటంతో ఫ్యాన్స్‌ కూడా అప్‌సెట్‌ అయ్యారు. అతడిని ఓపెనింగ్‌కు కాకుండా 3వ స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇప్పుడు ఇంటర్నెట్‌లో పలు మీమ్స్‌ వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని