Sunil Narine: మరోసారి అదరగొట్టిన సునీల్‌ నరైన్‌.. మురిసిపోయిన కేకేఆర్‌

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ మరోసారి రెచ్చిపోయాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఫైనల్లో అతడు అదిరిపోయే ప్రదర్శన చేశాడు. దీంతో కోమిల్లా విక్టోరియన్స్ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు...

Published : 19 Feb 2022 10:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ మరోసారి రెచ్చిపోయాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్లో అతడు అదిరిపోయే ప్రదర్శన చేశాడు. దీంతో కోమిల్లా విక్టోరియన్స్ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే అతడి ప్రదర్శన చూసి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సంతోషంలో మునిగి తేలింది. బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లో శుక్రవారం ఫార్చూన్‌ బారిషల్‌ జట్టుతో జరిగిన ఫైనల్లో కోమిల్లా టీమ్‌ ఒక్క పరుగుతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన నరైన్‌ (57; 23 బంతుల్లో 5x4, 5x6) దంచికొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. దీంతో ఈ లీగ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో తక్కువ బంతుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో ఆ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితం అయింది.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఫార్చూన్‌ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులే చేసింది. దీంతో తృటిలో ఆ జట్టు ఒక్క పరుగుతో ఓటమిపాలైంది. కాగా, ఈ మ్యాచ్‌లో నరైన్‌ ఆటే హైలైట్‌గా నిలిచింది. అతడు క్రీజులో ఉన్నంతసేపు పరుగుల వరద పారింది. ఫోర్లు, సిక్సర్లతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక బుధవారం చట్టోగ్రామ్‌ జట్టుతో జరిగిన నాకౌట్‌ మ్యాచ్‌లోనూ నరైన్‌ అదరగొట్టాడు. అప్పుడు అతడు 13 బంతుల్లోనే అర్ధశతకం సాధించి త్రుటిలో యువరాజ్‌ ప్రపంచ రికార్డును కోల్పోయాడు. దీంతో నరైన్‌ ఇలా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో వరుసగా బ్యాట్‌ ఝుళిపించడంతో ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫ్రాంఛైజీ మురిసిపోతోంది. ఆ జట్టులో ఎంతో కాలంగా కీలక ఆటగాడిగా కొనసాగుతున్న అతడు 2012, 2014 సీజన్లలో విజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ ఏడాది మెగా వేలానికి ముందు అతడిని అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే సీజన్‌లోనూ నరైన్‌ తమ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడనే ఆశతో ఉంది. మరి ఐపీఎల్‌ మెగా టోర్నీలో ఈ విండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ అదరగొడతాడో లేదో చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని