SRH vs RR: ఆరెంజ్ రాత మారేనా?
2016లో ఛాంపియన్స్.. వరుసగా నాలుగేళ్లు ప్లేఆఫ్స్. కానీ గత రెండు సీజన్‌లలో ఘోర వైఫల్యం. నిరుడు 10 జట్లలో ఎనిమిదో స్థానం. అంతకుముందు 8 జట్లలో చిట్టచివరి ర్యాంకు.
సన్‌రైజర్స్‌కు తొలి పరీక్ష
రాజస్థాన్‌తో మ్యాచ్ నేడు
2016లో ఛాంపియన్స్.. వరుసగా నాలుగేళ్లు ప్లేఆఫ్స్. కానీ గత రెండు సీజన్‌లలో ఘోర వైఫల్యం. నిరుడు 10 జట్లలో ఎనిమిదో స్థానం. అంతకుముందు 8 జట్లలో చిట్టచివరి ర్యాంకు. ఐపీఎల్‌లో గత ఏడేళ్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానమిది. వరుసగా రెండు సీజన్‌లలో వైఫల్యం నేపథ్యంలో కోచ్, కెప్టెన్‌తో సహా పూర్తి ప్రక్షాళన చేసిన సన్‌రైజర్స్ 2023 సీజన్‌కు సిద్ధమైంది. కొత్త కెప్టెన్.. సరికొత్త కూర్పుతో కనిపిస్తున్న ఆరెంజ్ ఆర్మీ ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ పోరుతో ఐపీఎల్-16కు శ్రీకారం చుట్టనుంది.
బ్యాటింగ్ ప్రక్షాళన: సన్‌రైజర్స్ బ్యాటింగ్ అంటే గుర్తొచ్చేది డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోల జోడీనే. ఈ జోడీ విడిపోవడం.. వార్నర్ కూడా దూరమవడంతో ఆ జట్టు బ్యాటింగ్ పూర్తిగా గాడితప్పింది. దీంతో బ్యాటింగ్ కోచ్ బ్రయాన్ లారాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించిన సన్‌రైజర్స్ ఆటగాళ్ల వేలం పాటలో బ్యాటింగ్ లోతును పెంచుకుంది. మయాంక్ అగర్వాల్, అభిషేక్‌శర్మ, రాహుల్ త్రిపాఠితో టాప్ ఆర్డర్‌ను సిద్ధం చేసుకుంది. ఇంగ్లాండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్, మార్‌క్రమ్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్‌లతో మిడిలార్డర్‌ను బలంగా తీర్చిదిద్దింది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కలుపుకుంటే ఎనిమిదో నంబరు వరకు సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్ వనరులు ఉన్నట్లే. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు టైటిల్ అందించిన మార్‌క్రమ్‌ను హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. తొలి మ్యాచ్‌కు మార్‌క్రమ్ అందుబాటులో లేకపోయినా సీజన్ మొత్తానికి అతనే సారథి. నిరుడు సన్‌రైజర్స్ తరఫున రాణించిన మార్‌క్రమ్ నాయకత్వ లక్షణాలు, అనుభవం, బ్యాటింగ్ ఫామ్ ఈసారి జట్టుకు కలిసిరావొచ్చు. జట్టులో బ్రూక్ చేరిక మరో కీలక పరిణామం. నిరుడు సెప్టెంబరులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 24 ఏళ్ల బ్రూక్ ఇంగ్లాండ్ టెస్టు జట్టు తరఫున రికార్డులతో హోరెత్తిస్తున్నాడు. పాకిస్థాన్‌లో ఇంగ్లాండ్‌కు చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని అందించిన బ్రూక్.. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌ల్లో 80.90 సగటు, 98.77 స్ట్రైక్‌రేటుతో 809 పరుగులు సాధించాడు. దేశవాళీ టీ20ల్లో 99 మ్యాచ్‌ల్లో 148.38 స్ట్రైక్‌రేటుతో 2432 పరుగులు రాబట్టాడు. భారీ అంచనాలతో బరిలో దిగుతున్న బ్రూక్ ఐపీఎల్ స్టార్ అవుతాడో లేదో చూడాలి.
ఉమ్రాన్ వేగం..: ఎప్పట్లాగే సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగానికి భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహించనున్నాడు. మార్‌క్రమ్ గైర్హాజరీలో రాజస్థాన్‌తో పోరులో భువి జట్టును ముందుండి నడిపించనున్నాడు. భువి స్వింగ్, అనుభవం సానుకూలాంశాలే అయినా అతనిలో మునుపటి వాడి లేదన్నది సుస్పష్టం. డెత్‌లో అతని బౌలింగ్ సామర్థ్యంపైనా సందేహాలు లేకపోలేదు. అయితే తన సత్తాపై ప్రశ్నలు వచ్చిన ప్రతిసారి బౌలింగ్‌తో సమాధానమిచ్చిన భువి ఈసారి కూడా అదే మార్గాన్ని అనుసరించనున్నాడు. ఇక భువి, ఉమ్రాన్ మాలిక్, జాన్సెన్, నటరాజన్‌లతో సన్‌రైజర్స్ పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. భువి, నటరాజన్ లయ అందుకుంటే వాళ్ల స్వింగ్, యార్కర్లకు ప్రత్యర్థుల దగ్గర సమాధానాలు ఉండకపోవచ్చు. ఉమ్రాన్, జాన్సెన్‌లూ సమర్థులైన పేసర్లే. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తున్న జమ్మూకాశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ ఈసారి సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నాడు. నిరుడు 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లతో రాణించిన అతను.. టీమ్‌ఇండియా తరఫున వన్డేలు, టీ20ల్లో అనుభవమూ సంపాదించాడు. గత సీజన్‌లో 7 నుంచి 16 ఓవర్ల మధ్య 19 వికెట్లు తీసిన మాలిక్ మరోసారి మధ్య ఓవర్లలో ప్రభావం చూపించగలడు. గుజరాత్‌కు తరలివెళ్లిన లెగ్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ లోటు అడిల్ రషీద్ ఎలా భర్తీ చేస్తాడన్నది ఆసక్తికరం.
రాజస్థాన్.. రెండో టైటిల్ కోసం: 2008 ఆరంభ ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి టైటిల్ కోసం దండయాత్ర చేస్తూనే ఉంది. నిరుడు ఫైనల్ వరకు వచ్చిన రాజస్థాన్ చివరికి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఒకరిద్దరు మినహా దాదాపు నిరుటి జట్టుతోనే బరిలో దిగుతున్న రాజస్థాన్ ఈసారి టైటిల్‌పై గురిపెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్న రాజస్థాన్ సమష్టిగా సత్తాచాటితే ప్రభావం చూపించగలదు. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ రాజస్థాన్ బ్యాటింగ్‌కు వెన్నుముకగా నిలవనున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైశ్వాల్.. బౌలింగ్‌లో చాహల్, అశ్విన్, బౌల్ట్ కీలకం కానున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM