
IPL 2021: రాజస్థాన్‌పై హైదరాబాద్ విజయం
దుబాయ్: ఈ సీజన్లో ఎట్టకేలకు హైదరాబాద్ రెండో విజయం సాధించింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. రాజస్థాన్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని విలియమ్సన్ సేన 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్ జట్టులో జేసన్ రాయ్(60: 42 బంతుల్లో 8X4, 1x6), కెప్టెన్ విలియమ్సన్ (51 నాటౌట్: 41 బంతుల్లో 5X4, 1X6) అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో హైదరాబాద్‌కు వరుస ఓటముల నుంచి స్వాంతన లభించినట్టైంది. అంతకుముందు రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ (82: 57 బంతుల్లో 7x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, జైశ్వాల్(36) రాణించాడు. అర్ధసెంచరీతో చెలరేగి హైదరాబాద్‌కు విజయాన్ని అందించిన జేసన్‌రాయ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
జేసన్ దూకుడు..
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఓపెన్లరు శుభారంభం అందించారు. జేసన్‌రాయ్, వృద్ధి సాహా తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మంచి ఊపు మీద ఉన్న ఈ జోడిని లామ్రోర్ విడగొట్టాడు. అతడు వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి వృద్ధిమాన్ సాహా స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్తో జేసన్‌రాయ్ జట్టుకట్టాడు. వీలుచిక్కినప్పడల్లా బౌండరీలతో జేసన్ (60) దూకుడు పెంచాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఈ జోడి 90 పరుగులు చేసి విజయం దిశగా సాగింది. ఈ క్రమంలో జేసన్ రాయ్ జట్టు స్కోర్ 114 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన ప్రియమ్ గార్గ్(0) డకౌట్ కావడంతో హైదరాబాద్ శిబిరంలో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే కెప్టెన్ విలియమ్సన్ క్రీజులో ఉండడంతో విజయంపై ఆ జట్టు భరోసాగానే కనిపించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ(21 నాటౌట్)తో కలిసి విలియమ్సన్ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ విజయతీరాల వైపు తీసుకెళ్లాడు. ఇక 18 ఓవర్లలో 16 పరుగులు రావడంతో ఎస్ఆర్హెచ్ విజయం లాంఛనం అయింది. చివర్లో విలియమ్సన్ వరుసగా రెండో ఫోర్లు కొట్టడంతో జట్టు విజయంతో పాటు అర్ధశతకం కూడా నమోదు చేశాడు. రాజస్థాన్ జట్టులో ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహిపాల్ లామ్రోర్, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు.
సంజూ శాంసన్ ఒంటరి పోరాటం..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 11 పరుగుల వద్ద లెవిస్ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన సంజూ శాంసన్ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (36)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అయితే జైశ్వాల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్‌స్టోన్ (4) ఎక్కువసేపు నిలబడలేదు. 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసిన రాజస్థాన్‌ను మహిపాల్ లామ్రోర్ (29)తో కలిసి శాంసన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో సంజూతోపాటు పరాగ్ పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్ 164 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2.. సందీప్ శర్మ, భువనేశ్వర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.