Supreme Court: బీసీసీఐ పిటిషన్‌పై కొత్త అమికస్‌ క్యూరీని నియమించిన సుప్రీంకోర్టు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది...

Published : 21 Jul 2022 18:32 IST

దిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. బీసీసీఐ ఆఫీస్‌ బేరర్ల పదవీ కాలానికి సంబంధించి రాజ్యాంగ సవరణ కోరుతూ బీసీసీఐ గతంలో వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా వారు అమికస్ క్యూరీని నియమించి.. విచారణను జులై 28న చేపడతామని తెలిపారు. ఇంతకుముందు అమికస్‌ క్యూరీగా ఉన్న పీఎస్ నరసింహ ఇప్పుడు న్యాయమూర్తిగా పదోన్నతి చెందిన నేపథ్యంలో మణిందర్ సింగ్‌ను కొత్తగా నియమించారు.

రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు, బీసీసీఐలోని ఆఫీస్ బేరర్ల పదవీకాలాల మధ్య తప్పనిసరిగా ఉన్న కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ వ్యవధిని తొలగించాలని, అందుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని బీసీసీఐ తమ పిటిషన్‌లో కోరింది. కాగా, గతంలో జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐలో పలు సంస్కరణలకు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని అంగీకరించింది. దీంతో రాష్ట్ర క్రికెట్ సంఘం లేదా బీసీసీఐ స్థాయిలో ఆఫీస్ బేరర్‌లకు ఆరేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే.. గంగూలీ, జైషా ఇదివరకే బెంగాల్‌, గుజరాత్‌ క్రికెట్‌ సంఘాల్లో పనిచేయడంతో ఆ నిబంధన ఇప్పుడు వారికి అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలోనే కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ను రద్దు చేయాలని బీసీసీఐ కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని