IPL - MSD: ఐపీఎల్‌ 2024లోనూ ఎంఎస్ ధోనీ ఆడతాడా..? రైనా రెస్పాన్స్‌ ఇదే..!

మరో పక్షం రోజుల్లో ఐపీఎల్‌ (IPL 2023) సందడి మొదలు కానుంది. దాదాపు రెండు నెలల పాటు జరిగే మెగా టోర్నీలో ఆటగాళ్లు సర్వశక్తులూ ఒడ్డుతారు. కెప్టెన్‌ కూల్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే, ఇదే చివరి సీజన్‌ అవుతుందా..? లేకపోతే వచ్చేఏడాది కూడా ఆడతాడా..? అనేది అందరిలోనూ మెదిలే ప్రశ్నలు.

Published : 16 Mar 2023 16:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) పదహారో సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) జట్ల మధ్య పోరుతో మెగా టోర్నీ షురూ అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రాక్టీస్‌ను కూడా ప్రారంభించేశాడు. అయితే, ఈ సీజన్‌ తర్వాత ధోనీ ఐపీఎల్‌కూ గుడ్‌బై చెప్పేస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని సురేశ్‌ రైనా (Suresh Raina) దృష్టికి తీసుకెళ్లగా.. అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం రైనా లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (LLC) ఆడుతున్నాడు. ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో రైనా మాట్లాడుతూ.. తప్పకుండా వచ్చేసీజన్‌లోనూ ఆడతాడని పేర్కొన్నాడు. 

‘‘ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లోనూ ఆడాలని కోరుకుంటున్నా. అయితే, అతడి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. బ్యాటింగ్‌ బాగానే చేస్తాడు. ఫిట్‌నెస్‌లో తిరుగులేదు. అయితే, ఈ ఏడాది ధోనీ ప్రదర్శనపైనే వచ్చే సీజన్‌ ఆడాలా...? వద్దా..? అనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. సంవత్సరం నుంచి ఆడని ధోనీ, అంబటి రాయుడుకు సవాల్‌ తప్పదు. జట్టు ఇప్పటికీ చాలా బలంగా ఉంది. చాలామంది యువ ఆటగాళ్లు నిరూపించుకుంటున్నారు. రుతురాజ్‌ గైక్వాడ్, డేవన్ కాన్వే, జడేజా, బెన్ స్టోక్స్, దీపక్ చాహర్.. ఇలా అనుభజ్ఞులు, యువతతో కూడిన జట్టు సిద్ధంగా ఉంది. అయితే, వారు ఎలా ఆడతారో చూడాలి’’ అని రైనా చెప్పాడు.

ఇప్పటికీ ధోనీ ఫోన్‌లోనూ అందుబాటులో ఉండడని చాలా మంది క్రికెటర్లు చెబుతూ ఉంటారు. అయితే, తాను మాత్రం ధోనీతో టచ్‌లోనే ఉన్నట్లు రైనా తెలిపాడు. ‘‘అలాంటిదేం లేదు. తరచూ టచ్‌లోనే ఉంటాం. ఇప్పుడు ధోనీ కఠినంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. సీఎస్‌కే సోషల్‌ మీడియాలోని వీడియోలను చూస్తే మీకే తెలుస్తుంది. నెట్స్‌లో భారీ షాట్లను కొట్టేస్తున్నాడు. ఇలానే మ్యాచ్‌లోనూ ఆడితే విజయం వరించడం ఖాయం’’ అని రైనా తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు