Suresh Raina: రాజస్థాన్‌తో పోరు.. గుజరాత్‌కే ఎక్కువ అవకాశం: రైనా

భారత టీ20 లీగ్‌ తుదిపోరులో కొత్త జట్టు గుజరాత్‌కే విజేతగా నిలిచే అవకాశం కాస్త ఎక్కువగా ఉందని చెన్నై మాజీ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు...

Published : 29 May 2022 16:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ తుదిపోరులో కొత్త జట్టు గుజరాత్‌కే విజేతగా నిలిచే అవకాశం కాస్త ఎక్కువగా ఉందని చెన్నై మాజీ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. ఆ జట్టుకు నాలుగు, ఐదు రోజులు తగిన విశ్రాంతి దొరికిందని, అలాగే వరుస విజయాలు సాధించడం కూడా మరో కారణమని చెప్పాడు. ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు రాజస్థాన్‌ను తక్కువ అంచనా వేయొద్దని చెప్పాడు.

‘తుదిపోరులో రాజస్థాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు. ఆ జట్టు ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది. ఒకవేళ ఓపెనర్‌ జోస్‌బట్లర్‌ చివరి మ్యాచ్‌లోనూ బ్యాట్‌తో చెలరేగితే రాజస్థాన్‌కు బాగా కలిసివస్తుంది. దీంతో గుజరాత్‌తో తలపడే తుదిపోరు ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు అహ్మదాబాద్‌ పిచ్‌ చాలా అద్భుతంగా ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఇదివరకు ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్‌ ఎలాంటి షాట్లు ఆడారో మనం చూశాం’ అని రైనా పేర్కొన్నాడు. ఇక దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌స్మిత్‌ స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయం సాధించడానికే కాస్త ఎక్కువ అవకాశం ఉందని చెప్పాడు. ఇదివరకు బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఈ పిచ్‌ మీదే క్వాలిఫయర్‌-2 పోటీలో తలపడిందని గుర్తుచేశాడు. దీంతో వాళ్లు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారని వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని