Suresh Raina: మళ్లీ లీగ్‌ క్రికెట్‌లోకి సురేశ్‌ రైనా..

దాదాపు రెండేళ్ల తర్వాత టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా బ్యాట్‌ పట్టేందుకు సిద్ధమైపోయాడు. అయితే ఈసారి టీ10 లీగ్‌లో అభిమానులను అలరించనున్నాడు. 

Published : 02 Nov 2022 01:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సురేశ్ రైనా.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరేమో. టీమ్‌ఇండియా తరఫునే కాకుండా.. భారత టీ20 లీగ్‌లోనూ చెన్నై ఫ్రాంచైజీ తరఫున కీలక పాత్ర పోషించాడు. గత రెండేళ్ల నుంచి రైనా బ్యాటింగ్‌ను చూడలేకపోయిన అభిమానుల కోసం మళ్లీ వచ్చేస్తున్నాడు. అయితే ఈసారి విదేశీ లీగ్‌లో క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమైపోయాడు. అది అబుదాబి టీ10 లీగ్‌లో సుమా.. ఏదైతేనేం మళ్లీ రైనా బ్యాటింగ్‌ను చూసే అవకాశం రావడం అభిమానులకు ఆనందకర విషయమే. నవంబర్ 23 నుంచి అబుదాబి వేదికగా టీ10 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు సంబంధించి డెక్కన్ గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీతో జట్టు కట్టేందుకు రైనా సంతకం చేసేశాడు. ఈ మేరకు టీ10 లీగ్‌ నిర్వాహకులు సోషల్‌ మీడియా వేదికగా ధ్రువీకరించారు.

టీమ్‌ఇండియా గెలిచిన వన్డే ప్రపంచకప్‌ 2011 జట్టులో సభ్యుడు సురేశ్‌ రైనా. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రైనా కెరీర్‌ 2020 వరకు అప్రతిహతంగా సాగింది. ఆ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చెన్నై జట్టులో ధోనీ తర్వాత ‘చిన్న తలైవా’ అంటూ ముద్దుగా పిలుచుకొనేవారు. అయితే రెండేళ్ల కిందట చివరిసారిగా చెన్నైకి ఆడిన  రైనా.. ఆ తర్వాత దూరం కావాల్సి వచ్చింది. మెగా వేలంలోనూ చెన్నై ఫ్రాంచైజే కాకుండా ఇతర జట్లూ కొనుగోలు చేయలేదు. దీంతో ఇటీవల అన్ని దేశవాళీ, లీగ్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. ఇక సురేశ్‌ రైనా బ్యాటింగ్‌ను చూడటం కష్టమని అభిమానులు భావించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని