SKY: ‘మిస్టర్ 360’ సూర్యకుమార్‌ యాదవ్‌లో ఆ సత్తా ఉంది: అజహరుద్దీన్‌

టీమ్‌ఇండియా (Team India) ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav) హార్డ్ హిట్టర్‌. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆసీస్‌తో (IND vs AUS) టెస్టు సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూర్యను తీసుకోవడంపై అజహరుద్దీన్‌ (Mohammed Azharuddin) స్పందించాడు.

Published : 16 Jan 2023 14:04 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ఫార్మాట్‌లో సూపర్  ఇన్నింగ్స్‌లతో సూర్యకుమార్‌ అదరగొట్టేశాడు. మిస్టర్‌ 360 ఆటగాడిగా పేరొందాడు. కానీ, వన్డేల్లో మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇంకా టెస్టుల్లోకి అరంగేట్రం చేయలేదు. అలాగే ఇటీవల వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్‌ సెంచరీ బాదిన ఇషాన్‌ కిషన్‌కూ ఛాన్స్‌లు కూడా ఎక్కువగా రావడం లేదు. సూర్యకుమార్‌తోపాటు ఇషాన్‌కూ అన్ని ఫార్మాట్లు ఆడగల సత్తా ఉందని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ వ్యాఖ్యానించాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో ఇషాన్, సూర్య స్థానం సంపాదించారు. పంత్‌ గైర్హాజరీలో ఇషాన్‌కు చోటు కల్పించాలని తొలుత తెలిపిన వ్యక్తి అజహరుద్దీన్‌ కావడం విశేషం.

‘‘ఇటీవల ప్రదర్శన ఆధారంగా ఇషాన్‌ కిషన్‌ను ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయడం బాగుంది. వికెట్‌ కీపర్‌ - బ్యాటర్‌ స్థానానికి ఇషాన్‌ బలమైన పోటీదారు. లెఫ్ట్‌ఆర్మ్‌ బ్యాటర్‌ కావడం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తాడు. ఓ ఆటగాడు ఫామ్‌లో ఉన్నప్పుడు.. అతడిని బెంచ్‌కు పరిమితం చేయడం సరికాదు. మరీ ముఖ్యంగా సూర్యకుమార్‌వంటి క్రికెటర్‌ అన్ని ఫార్మాట్లకు తగ్గ ఆటగాడు. అతడి బ్యాటింగ్‌ చూసిన తర్వాత ఒక్కటే చెప్పాలనిపిస్తోంది.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాదిరిగా అన్ని ఫార్మాట్లు ఆడగలడు. అయితే అతడికి చోటు కల్పించడం కూడా కష్టమే. వచ్చిన అవకాశాలను ఇషాన్‌, సూర్య సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని  అజహరుద్దీన్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని