T20 World Cup: భారత్‌ ప్రపంచ కప్‌ నెగ్గే అవకాశం.. అతడిపైనే ఆధారపడి ఉంది: మాజీ సెలెక్టర్‌

మరో పన్నెండు రోజుల్లో టీ20 ప్రపంచ కప్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత్‌ విజేతగా నిలవాలంటే అన్ని రంగాల్లో రాణించాలి. అయితే టీమ్‌ఇండియా మాజీ సెలెక్టర్‌ సబా కరీం మాత్రం టీమ్‌ఇండియా విజయావకాశాలు ఒక్క బ్యాటర్‌పైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషించాడు.

Published : 05 Oct 2022 01:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో వరుసగా అర్ధశతకాలు (61, 50 నాటౌట్‌) నమోదు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ ప్రదర్శనపై టీమ్‌ఇండియా మాజీ సెలెక్టర్‌ సబా కరీం స్పందించాడు. సూర్యకుమార్‌ ఫామ్‌పైనే పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయని కీలకవ వ్యాఖ్యలు చేశాడు. ఓ క్రీడా ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో కరీం పాల్గొన్నాడు. 

‘‘ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను. సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌పైనే టీ20 ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా సాధించే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. చాలా క్లిష్టమైన స్థానంలో ఆడతున్నాడు. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్‌రేట్‌తో ఆడటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే సూర్యకుమార్‌ తన నైపుణ్యం, అనుభవంతో రాణిస్తున్నాడు. సరైన ప్రాంతాల్లో ఫీల్డర్ల మధ్య గ్యాప్‌ను కనుక్కొని షాట్లు కొట్టగల సామర్థ్యం సూర్యకుమార్‌ సొంతం. ప్రత్యర్థుల బౌలింగ్‌ను అవలీలగా ఆడేస్తున్నాడు. సులువుగా అనుకొన్న ప్రాంతానికి బంతిని పంపిస్తున్నాడు. అందుకే సూర్యకుమార్‌ ఫామ్‌ను ఇలాగే కొనసాగించాలని ప్రార్థిస్తున్నా. ప్రపంచకప్‌లోనూ అదరగొట్టాలి’’ అని సబా కరీం వెల్లడించాడు. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్ఇండియా అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌  ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని