SKY: వాషింగ్టన్ సుందర్ విషయంలో నాదే తప్పు.. వైరల్‌గా మారిన సూర్య వ్యాఖ్యలు

న్యూజిలాండ్‌తో (IND vs NZ) జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ (Team India) గెలవడంలో స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్‌ (Surya Kumar Yadav) కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా వాషింగ్టన్‌ సుందర్‌కు (Washington Sundar) క్షమాపణలు తెలిపాడు. ఎందుకంటే..?

Updated : 29 Jun 2023 16:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-1తో సమంగా నిలిచింది. ఈ క్రమంలో జట్టును గెలిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌ చేసిన కీలక వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ అతడేం చెప్పాడు.. ఎందుకు చెప్పాడో తెలియాలంటే.. దీనిపై ఓ లుక్కేయండి..

పది ఓవర్లు.. స్కోరు బోర్డుపై 49 పరుగులు.. ఓపెనర్లు అప్పటికే ఔట్.. ఇక చివరి 10 ఓవర్లలో భారత్‌ లక్ష్యం 51.. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయనే ధీమా.. డ్రింక్స్‌ బ్రేక్‌ ముగిసిన తర్వాతి ఓవర్‌లోనే కుదురుగా ఆడుతున్న రాహుల్‌ త్రిపాఠి పెవిలియన్‌కు చేరాడు. ఆ ఓవర్‌లో రెండే పరుగులు వచ్చాయి. దీంతో విజయ సమీకరణం 9 ఓవర్లలో 49 పరుగులకు చేరింది. ఇలాంటి సమయంలో సూర్యకుమార్‌ (26*)తో కలిసి వాషింగ్టన్ సుందర్ (9 బంతుల్లో 10) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు.  అయితే 36 బంతుల్లో 30 పరుగులుగా భారత విజయ సమీకరణం మారింది. కానీ, గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ చేసిన తప్పిదంతో వాషింగ్టన్ సుందర్‌ తన వికెట్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. 15వ ఓవర్‌ మూడో బంతిని ఆడిన సూర్యకుమార్‌.. బాల్‌ పక్కనే పెట్టుకొని మరీ పరుగు కోసం ముందుకొచ్చేశాడు. అప్పటికీ వాషింగ్టన్ సుందర్ వద్దని చెబుతున్నా సరే ఆగకుంగా నాన్‌స్ట్రైకింగ్‌ వైపు దూసుకొచ్చాడు. దీంతో సూర్యకుమార్‌ వికెట్‌ విలువను గుర్తెరిగిన సుందర్‌ అడుగులు ముందుకేసి రనౌట్‌ రూపంలో తీవ్ర అసంతృప్తితో డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో చివరి వరకూ క్రీజ్‌లో ఉండి భారత్‌ను విజయతీరాలకు చేర్చిన సూర్యకుమార్‌ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అందుకొన్నాడు. ఈ సందర్భంగా వాషింగ్టన్ సుందర్‌ రనౌట్‌ విషయంలో తనదే తప్పు అని అంగీకరించాడు. 

మ్యాచ్‌ అనంతరం సూర్యకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘రనౌట్ విషయంలో పూర్తిగా నాదే తప్పు. బంతి ఎక్కడికి వెళ్లిందనేది నేను గమనించలేదు. అక్కడైతే కచ్చితంగా పరుగు రాదు’’ అని వెల్లడించాడు. కఠినమైన పిచ్‌ మీద ప్రతి పరుగూ రాబట్టడం కష్టంగా మారింది. అయితే చివరి వరకూ బ్యాటింగ్‌ చేసి జట్టును గెలిపించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. సుందర్‌ను రనౌట్‌ చేయడంపై సూర్య చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజాయతీగా అంగీకరించిన సూర్యను అభిమానులు, నెటిజన్లు ప్రశంసించారు. అలాగే టీమ్‌ఇండియాను గెలిపించినందుకు అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని