SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్‌

న్యూజిలాండ్‌తో (New zealand) మూడో టీ20 మ్యాచ్‌ (IND vs NZ) కోసం భారత్ (Team India) సిద్ధమవుతోంది. సిరీస్‌ విజేతను తేల్చే మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ వేదిక.  

Published : 01 Feb 2023 14:56 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ చరిత్రలో ఎంఎస్ ధోనీది ప్రత్యేక స్థానం. టీమ్‌ఇండియాకు టీ20, వన్డే ప్రపంచకప్‌ను అందించిన నాయకుడు. ఒత్తిడి సమయంలోనూ తనదైన అద్భుతమైన నిర్ణయాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించిన మిస్టర్ కూల్‌ కెప్టెన్. నిశ్శబ్దంగా కర్తవ్య బాధ్యతలను నిర్వర్తించిన ధోనీని టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. క్లిష్టమైన ట్రాక్‌లపైనా భారత్‌ను అద్భుతంగా నడిపించిన ధీశాలిగా అభివర్ణించాడు. టీ20ల్లో టాప్‌ ర్యాంకర్‌గా ఉన్న సూర్యకుమార్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు. కీలకమైన రెండో మ్యాచ్‌లో విజయతీరాలకు చేర్చిన సూర్య.. సిరీస్‌ను తేల్చే మూడో టీ20లోనూ రాణించేందుకు సన్నద్ధమవుతున్నాడు. సవాల్‌ విసిరిన లఖ్‌నవూ ట్రాక్‌పై ఎలాంటి ఆందోళన లేకుండా జట్టును గెలిపించడంపై సూర్యకుమార్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. సిరీస్‌ మొదలైన రాంచీ నుంచే (ధోనీ సొంత రాష్ట్రం) ప్రారంభమై ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించాడు.

‘‘న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ రాంచీలో ప్రారంభమైంది. అక్కడి నుంచే ‘ప్రశాంతంగా ఉండే వైఖరి’వచ్చి ఉంటుంది. అయితే, నేను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టకముందు దేశవాళీ క్రికెట్‌ను భారీ స్థాయిలో ఆడాను. అది చాలా సహాయ పడింది. ఛాలెంజింగ్‌ విసిరే పిచ్‌ల మీదే ఆడటం బాగా ఉపయోగపడింది.  అక్కడ ఏదైతే నేర్చుకొన్నానో.. దానినే ఇక్కడ అమలు చేస్తున్నా. సీనియర్ల ఆటను చూడటంతోపాటు, క్లిష్ట సమయాల్లో వారు ఎలా హ్యాండిల్‌ చేశారనేది వారి మాటల్లోనూ తెలుసుకోవడం కూడా అక్కరకొచ్చింది’’ అని సూర్యకుమార్‌ వెల్లడించాడు. 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది. ఇరు జట్లూ 1-1తో సమంగా నిలిచాయి. సిరీస్‌ విజేతను తేల్చే మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల అండర్ -19 మహిళల ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు ప్లేయర్లను బీసీసీఐ సత్కరించనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్‌ చేతులమీదుగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు