Suryakumar Yadav: అలా ఆడితేనే రెండేళ్లుగా నెంబర్‌ వన్‌ ర్యాంక్..: సూర్యకుమార్‌ యాదవ్

భారీ షాట్లతో విరుచుకుపడే సూర్యకుమార్ యాదవ్ యూఎస్‌ఏ పిచ్‌లపై మాత్రం విభిన్న ఆటతీరును ప్రదర్శించాడు. పరిస్థితికి తగ్గట్టు నెమ్మదించాడు.

Published : 20 Jun 2024 15:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ఫార్మాట్‌లో భారత ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav) టాప్‌ ర్యాంకర్. టీ20 ప్రపంచకప్‌ తొలి రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. దీంతో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ, కీలకమైన యూఎస్‌ఏతో మ్యాచ్‌లో మాత్రం హాఫ్ సెంచరీ సాధించి భారత్‌ను గెలిపించాడు. పరుగులు చేసేందుకు కఠినంగా ఉన్న అమెరికా పిచ్‌లపై ఆచితూచి ఆడాడు. ఇప్పుడు భారత్ సూపర్-8 కోసం విండీస్‌కు చేరుకుంది. ఇక్కడ బ్యాటర్లకు పిచ్‌ నుంచి సహకారం లభిస్తుంది. సూర్య నుంచి మరోసారి భారీ ఇన్నింగ్స్‌ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తన ఆటతీరుపై సూర్య ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 

‘‘ర్యాంకుల్లో నెంబర్‌వన్‌గా రెండేళ్ల నుంచి ఉన్నామంటే.. కేవలం దూకుడుగా ఆడటంతోనే సాధ్యం కాదు. విభిన్న పరిస్థితుల్లో మ్యాచ్‌కు అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. జట్టు అవసరాలను గమనించి బ్యాటింగ్‌ చేయాలి. బంతి ఎలా స్పందిస్తుందో అర్థంకాని సమయంలో ఆడటం చాలా కష్టం. మన బ్యాటింగ్‌పై పూర్తి అవగాహన ఉన్న బౌలర్లకు చిక్కకుండా పరుగులు రాబట్టాలంటే కాస్త ఓర్పు అవసరం. సహచర బ్యాటర్‌తో మాట్లాడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాలి. 

ఎలాంటి సమయంలోనూ ఆందోళనకు గురికాకుండా ఉండాలి. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బంతి బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్‌ కాదు. అలాంటప్పుడు ఖాళీ ప్రదేశాల్లో ఆడితే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు బంతులు గతి తప్పి వస్తాయి. వాటిని చక్కగా బౌండరీలుగా మలిచేందుకు ఆస్కారం ఉంటుంది. దానికోసం ఎదురుచూడాలి. యూఎస్‌ఏ, విండీస్‌ పిచ్‌లకు చాలా వ్యత్యాసం ఉందనిపిస్తోంది. నాణ్యమైన ఆటతీరు కనబరిస్తే మంచి స్కోర్లను సాధించడం ఖాయం’’ అని సూర్య వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని