Cricket news: కోహ్లీ, రోహిత్‌ ఓపెనర్లైతే సూర్యదే 3వ స్థానం

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఓపెనింగ్‌ చేస్తే సూర్యకుమార్‌ యాదవ్‌ను మూడో స్థానంలో ఆడించాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ఆ స్థానానికి అతడే సరైనోడని పేర్కొన్నాడు. కేఎల్‌ రాహుల్‌ను ఏం చేస్తారో తెలియదని,...

Published : 10 Jul 2021 01:07 IST

సంజయ్‌ మంజ్రేకర్‌ ఆశాభావం

ముంబయి: టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఓపెనింగ్‌ చేస్తే సూర్యకుమార్‌ యాదవ్‌ను మూడో స్థానంలో ఆడించాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ఆ స్థానానికి అతడే సరైనోడని పేర్కొన్నాడు. కేఎల్‌ రాహుల్‌ను ఏం చేస్తారో తెలియదని, తన వరకైతే సూర్య ఉండాల్సిందేనని స్పష్టం చేశాడు.

‘అవును, సూర్య ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేఎల్‌ రాహుల్‌ను ఎలా ఉపయోగించుకుంటారో తెలియదు. సూర్యకుమార్‌కు మాత్రం కచ్చితంగా చోటివ్వాలి. ఒక ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం సూర్యలా బ్యాటింగ్‌ చేసిన వారిని నేను చూడలేదు. అతడు  కట్టుదిట్టమైన బంతుల్నీ బౌండరీకి తరలించగలడు. అందుకే అతడికి మూడో స్థానమే సరైంది’ అని మంజ్రేకర్‌ అన్నాడు.

శ్రీలంక సిరీసులో సంజు శాంసన్‌ బదులు ఇషాన్‌ కిషన్‌కే కీపర్‌గా ఓటేస్తానని సంజయ్‌ అంటున్నాడు. టెస్టు క్రికెట్లో వికెట్‌  కీపింగ్‌కు ఉన్నంత ప్రాధాన్యం వన్డే, టీ20ల్లో ఉండదని తెలిపాడు. ‘నా ఎంపిక కిషన్‌. ఎందుకంటే నిలకడైన బ్యాటర్‌నే నేను కోరుకుంటాను. శాంసన్‌ అద్భుతమైన ఆటగాడే. స్వింగ్‌లో ఉంటే అతడికన్నా ఎవరూ మెరుగ్గా ఉండరు. నిలకడ పరంగా చూసుకున్నప్పుడు మాత్రం కిషన్‌కు ప్రాధాన్యం ఇస్తా’ అని తెలిపాడు.

కుల్‌దీప్‌ యాదవ్‌కు వన్డే జట్టులో చోటిచ్చినందుకు సంతోషంగా ఉందని మంజ్రేకర్‌ అన్నాడు. బ్యాట్స్‌మన్‌గా హార్దిక్‌ పాండ్య సత్తా ఏంటో ఆస్ట్రేలియా సిరీసులో నిరూపించుకున్నాడని తెలిపాడు. అతడు బౌలింగ్‌ సైతం మొదలు పెట్టాడని తెలిసిందన్నాడు. దాదాపుగా టీ20 ప్రపంచకప్‌ తుది జట్టుపై స్పష్టత వచ్చినట్టేనని వెల్లడించాడు. గతంలో ఎన్నడూ లేనంత బలంగా టీమ్‌ఇండియా టీ20 జట్టు ఉందని తెలిపాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ తరహాలో సందిగ్ధం లేదన్నాడు. ఇక ఓపెనర్‌గా దేవదత్‌ పడిక్కల్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని మరో మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా అన్నారు. పృథ్వీషా ఉన్నప్పటికీ భవిష్యత్తు దృష్ట్యా అతడికి చోటివ్వడం మంచిదన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని