Suryakumar Yadav: ఇదేం బాదుడో..

బ్యాటింగ్‌ ఇలా కూడా చేస్తారా.. షాట్లు ఇలా కూడా కొడతారా.. అసలీ షాట్లకు ఏం పేరు పెట్టాలి..? సూర్యకుమార్‌ యాదవ్‌ ఆట చూసే వాళ్లందరికీ ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి.

Updated : 13 May 2023 07:56 IST

బ్యాటింగ్‌ ఇలా కూడా చేస్తారా.. షాట్లు ఇలా కూడా కొడతారా.. అసలీ షాట్లకు ఏం పేరు పెట్టాలి..? సూర్యకుమార్‌ యాదవ్‌ ఆట చూసే వాళ్లందరికీ ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. దశాబ్దాలుగా క్రికెట్‌ను అనుసరిస్తూ ఎన్నో బ్యాటింగ్‌ విన్యాసాలు వీక్షించిన వాళ్లకు కూడా.. సూర్య బ్యాటింగ్‌ చిత్రాతి చిత్రంగా అనిపిస్తోంది. టీ20 క్రికెట్‌ ఊపందుకున్నాక స్కూప్‌, ర్యాంప్‌ షాట్లు ఎన్నో చూశాం. ఒంటిని విల్లులా వంచుతూ, క్రీజులో నాట్యం చేస్తూ  360 డిగ్రీల కోణంలో షాట్లు ఆడే డివిలియర్స్‌ను చూసి ఇలాంటి ఆటగాడు ఇంకొకడు రాడనే అనుకున్నాం. కానీ సూర్య వచ్చాడు. ఏబీనే మించిన 360 డిగ్రీ ఆటతో క్రికెట్‌ మైదానాన్ని వీడియో గేమ్‌ లాగా మార్చేస్తున్నాడు. సచిన్‌, గంగూలీ లాంటి మాజీలు.. విరాట్‌, బట్లర్‌ లాంటి సమకాలీన స్టార్‌ క్రికెటర్లు కూడా సూర్య బ్యాటింగ్‌కు ఆశ్చర్యపోతూ.. ఇలా ఆడటం ‘స్కై’ ఒక్కడికే సాధ్యం అని కితాబిస్తున్నారు. మధ్యలో అంతర్జాతీయ క్రికెట్లో కొంచెం తడబడి, ఫామ్‌ కోల్పోయిన సూర్య.. ఈ ఐపీఎల్‌ను కూడా నెమ్మదిగానే ఆరంభించాడు. కానీ ఒకసారి లయ అందుకున్నాక అతణ్ని ఆపడం కష్టమవుతోంది. 57 (26 బంతుల్లో), 23 (12), 55 (29), 66 (31), 26 (22), 83 (35).. ఇవీ చివరి ఆరు ఇన్నింగ్స్‌ల్లో సూర్య స్కోర్లు. దాదాపు 200 స్ట్రైక్‌ రేట్‌తో ప్రత్యర్థుల బౌలింగ్‌ను ఊచకోత కోస్తున్న అతను.. శుక్రవారం గుజరాత్‌పై మరింత రెచ్చిపోయాడు. 49 బంతుల్లోనే సెంచరీ కొట్టేసి ఔరా అనిపించాడు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే సూర్య అర్ధశతకం అందుకున్నది 17వ ఓవర్లో. ఆ ఓవర్‌ అయ్యేసరికి 53 పరుగులపై ఉన్నవాడు.. ఇన్నింగ్స్‌ చివరి బంతికి శతక అభివాదం చేశాడు. 4, 4, 0, 6, 2, 4, 6, 4, 0, 4, 2, 0, 6, 2, 6.. ఇదీ చివరి 15 బంతుల్లో సూర్య విధ్వంసం సాగిన తీరు. ఇక సూర్య కొట్టిన కొన్ని షాట్లను దృశ్య రూపంలో చూసి అబ్బురపడాల్సిందే తప్ప.. మాటల్లో వివరించడం కష్టం. సూర్య బ్యాట్‌ను కత్తిలా వాడి బంతిని కోస్తున్నట్లుగా కొట్టిన ఓ షాట్‌కు థర్డ్‌ మ్యాన్‌లో బంతి బౌండరీ దాటింది. స్టాండ్స్‌ నుంచి ఆ షాట్‌ను చూసిన ముంబయి మెంటార్‌ సచిన్‌.. ఆశ్చర్యపోతూ.. ‘‘ఇలా కోత కోసినట్లు కొట్టాడు.. అలా బంతి వెళ్లి బౌండరీ అవతల పడింది’’ అన్నట్లుగా పక్కనున్న చావ్లాకు చూపించడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని