IND vs AUS: ‘‘సూర్య కూల్‌గా ఉండాలి.. పంత్‌ అలాంటి షాట్‌ అస్సలు ఆడొద్దు’’

ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత ఆటగాళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉంటే చాలని సూర్యకుమార్‌ యాదవ్ చిన్ననాటి కోచ్ అశోక్ అశ్వాల్కర్ వ్యాఖ్యానించారు.

Updated : 24 Jun 2024 13:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) సూపర్‌-8 పోరులో భారత్‌ ఇవాళ చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఆస్ట్రేలియాతో సెయింట్‌ లూసియా వేదికగా టీమ్‌ఇండియా రాత్రి 8 గంటలకు తలపడనుంది. హ్యాట్రిక్‌ విజయాలతో భారత్‌ సెమీస్‌లోకి అడుగుపెట్టాలని ఫ్యాన్స్‌ ఆకాంక్ష. ఇలా జరగాలంటే ఆసీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలి. ప్రపంచకప్‌లో సూపర్ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్న సూర్యకుమార్‌ (Surya Kumar Yadav) మరోసారి రాణిస్తే ఇదేమంత పెద్ద కష్టం కాకపోవచ్చని అతడి చిన్ననాటి కోచ్ అశోక్ అశ్వాల్కర్ వ్యాఖ్యానించాడు. అయితే, ఒకే ఒక్క షాట్ విషయంలో రిషభ్‌ పంత్‌ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. 

‘‘ఆసీస్‌ బౌలర్లపై (IND vs AUS) ఎదురు దాడి చేసేటప్పుడు ఎక్కువగా ప్రయోగాలకు వెళ్లొద్దు. గత ఆరు మ్యాచుల్లో భారత్‌ ఎలా ఆడిందో.. అదేవిధంగా కంగారూల జట్టుపైనా ప్రదర్శన చేయాలి. ఓపెనర్లు నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ముందుకుతీసుకెళ్లాలి. మంచి ఆరంభం వస్తే చాలు ఆసీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించడం ఈజీ అయిపోతుంది. మరిన్ని ప్రయోగాలకు వెళ్లకుండా చూడాలి. ఆసీస్‌ బౌలింగ్‌ లైనప్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మన జట్టులో బుమ్రా (Jasprit Bumrah) ఈసారి కూడా కీలక పాత్ర పోషిస్తాడు. చాలామంది స్పిన్నర్లను ఎక్కువగా తీసుకున్నారనే కామెంట్లు చేశారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ కూడా దీనిపై సమాధానం ఇచ్చాడు. ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగాలనే దానిపై అతడికి పూర్తి స్పష్టత ఉంది. మందకొడిగా ఉన్న పిచ్‌పై స్లో బౌలర్లు ప్రభావం చూపిస్తారు. 

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి. సూర్యకుమార్‌ కూడా కూల్‌గా ఉంటే చాలు. అనవసరమైన షాట్ల కోసం ప్రయోగాలు చేయొద్దు. భారత వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్ (Rishabh Pant) మంచి ఫామ్‌లో ఉన్నాడు. చెత్త షాట్లకు వెళ్లి పెవిలియన్‌కు చేరుతున్నాడు. ఈసారి మాత్రం రివర్స్‌ స్వీప్ షాట్ల కోసం ప్రయత్నించకుండా ఉండాలి. కాస్త సమయం తీసుకుని ఆడితే చాలు భారత్‌ భారీ స్కోరు సాధించడం ఖాయమవుతుంది’’ అని అశ్వాల్కర్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని