Suryakumar Yadav: హలో ఫ్రెండ్‌.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్‌ యాదవ్‌

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) టెస్టుల్లో అరంగేట్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు.

Published : 05 Feb 2023 01:22 IST

ఇంటర్నెట్ డెస్క్: లేటు వయసులో జట్టులోకి వచ్చినా తక్కువ కాలంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియాకు కీలక బ్యాటర్‌గా మారిపోయాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav). వన్డేలు, టీ20ల్లో నిలకడగా పరుగులు సాధిస్తున్న సూర్య ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. సుదీర్ఘ ఫార్మాట్‌లో దేశం తరఫున ఆడాలనే అతడి కల అతి త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది. ఫిబ్రవరి 9 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా ( IND vs AUS) మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ (బోర్డర్ గావస్కర్ ట్రోఫీ) ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్‌ చోటు లభించింది. 

మిడిల్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే రిషభ్‌ పంత్‌ కారు ప్రమాదంలో గాయపడి సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ లోటును సూర్యకుమార్‌ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. స్కై కూడా టెస్టు మ్యాచ్‌లో ఛాన్స్‌ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇందుకు సూచనగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఎరుపు బంతి ఫోటోని ఉంచి ‘హలో ఫ్రెండ్‌’ అనే క్యాప్షన్‌ పెట్టాడు.  సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ ప్రారంభమయ్యే తొలి టెస్టులోనే అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోహిత్‌ శర్మ, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. పుజారా, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ తర్వాతి స్థానాల్లో ఆడతారు. దీంతో సూర్యకుమార్‌ని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి దింపే అవకాశముంది. సూర్యకి టెస్టుల్లో అవకాశం దక్కి పరిమిత ఓవర్లలో ఆడిన మాదిరిగానే నిలకడగా రాణించాలని టీమ్‌ఇండియా అభిమానులు ఆశిస్తున్నారు. మిస్టర్ 360 టెస్టుల్లో ఏం మేరకు రాణిస్తాడో చూడాలి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని