సహనానికి సలామ్‌: యువతకు సూర్య ఆదర్శం

ముంబయి క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ యువకులకు ఆదర్శంగా నిలిచాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంటున్నాడు. సెలక్టర్ల నుంచి పిలుపు ఆలస్యమైనప్పటికీ దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించాడని పేర్కొన్నాడు. ఓపికతో అవకాశం కోసం ఎదురుచూశాడని వెల్లడించాడు....

Published : 10 Mar 2021 01:34 IST

వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ యువకులకు ఆదర్శంగా నిలిచాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంటున్నాడు. సెలక్టర్ల నుంచి పిలుపు ఆలస్యమైనప్పటికీ దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించాడని పేర్కొన్నాడు. ఓపికతో అవకాశం కోసం ఎదురుచూశాడని వెల్లడించాడు. ముంబయి ఇండియన్స్ తరఫున అదరగొట్టాడని ప్రశంసించాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసుకు ఎంపికైన సూర్యకుమార్‌ పనితీరు, వైఖరిని ఆయన అభినందించాడు.

‘భారత్‌కు ఆడేందుకు సూర్యకుమార్‌ అర్హుడు. యువకులు, ప్రత్యేకించి భారతీయులకు అతడు ఆదర్శమనే అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా చాలా త్వరగా సహనం కోల్పోతారు. దేశవాళీ క్రికెట్లో సానుకూలంగా పరుగుల వరద పారించే ప్రతి ఒక్కరూ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వాలనే భావిస్తారు. కానీ అది కాస్త కష్టం’ అని లక్ష్మణ్‌ అన్నాడు.

‘టీమ్‌ఇండియాకు పోటీపడుతున్న వారిలో ఎంతోమంది నాణ్యమైన వాళ్లు, ప్రతిభావంతులు ఉన్నారు. కానీ సూర్యకుమార్‌ దేశవాళీ క్రికెట్లో ముంబయి తరఫున పరుగుల వరద పారించాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ముంబయి ఇండియన్స్‌కు అదరగొట్టాడు. సానుకూలంగా పరుగులు చేస్తాడు. కఠిన పరిస్థితుల్లో మ్యాచులు గెలిపిస్తాడు. ఆటగాడిలో కోరుకొనేదీ అదే కదా’ అని వీవీఎస్‌ తెలిపాడు.

‘ఈ సందర్భంలో నా కోచ్‌ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఒకవేళ సెలక్టర్లు నీకోసం తలుపులు తెరవకపోతే నీ ప్రదర్శనల ద్వారా దానిని బద్దలుకొట్టేయ్‌! అని చెప్పేవారు. సూర్యకు తుది 11 మందిలో చోటు దక్కుతుందో లేదో తెలియదు గానీ టీ20 జట్టులో ఉండేందుకు మాత్రం అతడు అర్హుడే’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని