Suryakumar Yadav: ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ 2022గా సూర్యకుమార్‌ యాదవ్‌

టీ20ల్లో 2022 సంవత్సరానికిగాను క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను ఐసీసీ (ICC) ప్రకటించింది.   

Published : 25 Jan 2023 18:02 IST

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా లేదా అనేది ముఖ్యం అనే డైలాగ్‌ని మనలో చాలామంది వినే ఉంటాం. ఈ డైలాగ్‌ టీమ్‌ఇండియా క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)కు కూడా సరిగ్గా సూటవుతుంది. ఎందుకంటే అతడు 30 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చినా యువ ఆటగాళ్లతో పోటీపడుతూ పరుగులు రాబడుతున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. 2022లో పొట్టి ఫార్మాట్లో సూర్య అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. 31 మ్యాచ్‌ల్లో 45.56 సగటుతో 1164 పరుగులు చేసి ఈ ఫార్మాట్లో అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు. వినూత్నమైన షాట్లు ఆడుతూ క్రికెట్‌ అభిమానులను అలరిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌కి ఐసీసీ (ICC) తగిన గుర్తింపునిచ్చింది. 2022 సంవత్సరానికిగాను టీ20ల్లో క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సూర్యని ప్రకటించింది. సూర్యకుమార్‌కు ఈ అవార్డు దక్కినందుకు బీసీసీఐ కూడా హర్షం వ్యక్తం చేసి అతడికి అభినందలు తెలిపింది. 

2022లో సూర్య రికార్డులు ఇలా.. 

2022 సూర్యకుమార్‌ కెరీర్‌లో మరుపురాని సంవత్సరంగా నిలుస్తుంది. పొట్టి ఫార్మాట్ల్లో అతడు ఇప్పటికి మూడు శతకాలు బాదగా.. అందులో రెండూ 2022లో బాదినవే.  అదే ఏడాది తొమ్మిది అర్ధ సెంచరీలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు సూర్య. ఏకంగా 68 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరే ఆటగాడు అతడి దరిదాపుల్లో కూడా లేడు. ఇక, టీ20 ప్రపంచకప్‌లో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన ‘స్కై’ మూడు హాఫ్‌ సెంచరీలు చేశాడు. నెదర్లాండ్స్‌పై 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.  

మహిళా క్రికెట్‌లో ఎవరంటే?  

మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ తహ్లియా మెక్‌గ్రాత్ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022గా ఎంపికైంది. ప్రస్తుతం ఈమె టీ20ల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఉంది. ఎమర్జింగ్‌ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌ 2022గా టీమ్‌ఇండియా బౌలర్‌ రేణుక సింగ్‌ని ఐసీసీ ఎంపిక చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని