Suryakumar Yadav: కోహ్లీ ఔటైనప్పుడు.. ఒత్తిడిని తట్టుకోవడానికి అలా చేశా: సూర్య

అఫ్గానిస్థాన్‌ బౌలర్లను కాచుకొని భారత బ్యాటర్ సూర్యకుమార్‌ అర్ధశతకం సాధించాడు. ఓ వైపు ఇతర బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడినా.. అతడు మాత్రం దూకుడు కొనసాగించాడు.

Published : 21 Jun 2024 10:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20ల్లో టాప్ ర్యాంకర్‌గా కొనసాగడానికి పూర్తి అర్హత తనకు ఉందని భారత బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav) మరోసారి నిరూపించాడు. పొట్టి కప్‌ సూపర్‌-8 పోరులో అఫ్గాన్‌ను చిత్తు చేయడంలో సూర్య (53: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లతోపాటు రిషభ్‌ పంత్‌ ఔటైనప్పుడు జట్టుపై ప్రతికూల ప్రభావం పడకుండా హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. కోహ్లీ ఔటైనప్పుడు మరో ఎండ్‌లో సూర్య ఉన్నాడు. ఆ సమయంలో ఈ స్టార్‌ బ్యాటర్ ఏం చేశాడనేది మ్యాచ్‌ అనంతరం వెల్లడించాడు.

‘‘మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తా. అందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్‌ కూడా చేశా. ప్రత్యర్థి బౌలర్లు మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తీసుకొనే సమయం అత్యంత క్లిష్టమైంది. అటువంటప్పుడు కాస్త దూకుడుగా షాట్లు ఆడాలి.  అలా ఆడటం కూడా నాకిష్టం. కీలక సమయంలో విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరడం బాధించింది. ఆ సమయంలో టెన్షన్‌కు గురికాకుండా నా బబుల్‌ గమ్‌ను ఇంకాస్త గట్టిగా నమిలా. మళ్లీ నా ఆటపై దృష్టిపెట్టా. రోహిత్‌తో కలిసి అతడి నాయకత్వంలో చాలా క్రికెట్ ఆడా. నా ఆటతీరు గురించి అంతా తెలుసు. ఏం చేయాలనే దాని గురించి పూర్తి అవగాహనతో ఉన్నా. హార్దిక్‌ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు దూకుడైన ఆటతీరునే కొనసాగించాలని భావించాం. ఈ వరల్డ్‌ కప్‌లో తొలిసారి భారత బ్యాటర్‌కు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఈసారి కూడా బౌలర్లకే పూర్తి అర్హత ఉంది. లక్ష్యాన్ని కాపాడటంలో వారిదే కీలక పాత్ర’’ అని సూర్య వ్యాఖ్యానించాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు.. 

  • అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికంగా ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులను దక్కించుకున్న క్రికెటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్ నిలిచాడు. మొత్తం 64 మ్యాచుల్లో 15సార్లు విజేతగా నిలిచాడు. విరాట్‌ కూడా 15 అందుకొన్నప్పటికీ.. అతడు 120 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు.
  • టీ20ల్లో భారత్‌ వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు గెలవడం ఇది మూడోసారి. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు వరుసగా 8 మ్యాచుల్లో గెలిచింది.
  • టీ20 ప్రపంచ కప్‌ల్లోని ఒక ఇన్నింగ్స్‌లో అందరు బ్యాటర్లూ క్యాచ్‌ల ద్వారానే పెవిలియన్‌కు చేరడం ఇది రెండోసారి. అఫ్గాన్‌కు చెందిన బ్యాటర్లు ఇలానే ఔటయ్యారు. అంతకుముందు (2022) ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అఫ్గాన్‌ పేరిటే ఈ చెత్త రికార్డు ఉంది.
  • ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్ 5 మ్యాచ్‌లకుగాను నాలుగు ఆడింది. ఒకటి వర్షం కారణంగా రద్దైంది. మూడు మ్యాచుల్లో బుమ్రా రెండుసార్లు.. అర్ష్‌దీప్‌, సూర్య ఒక్కోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది అవార్డు’ను అందుకొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు