Bajrang Punia: సుశీల్‌ కుమారే ఇప్పటికీ ఉత్తమ రెజ్లర్‌

భారత్‌లో ఉన్న రెజ్లర్లలో సుశీల్‌ కుమారే ఇప్పటికీ ఉత్తమ రెజ్లర్‌ అని టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన బజరంగ్‌ పునియా పేర్కొన్నాడు.....

Published : 27 Aug 2021 23:01 IST

దిల్లీ: భారత్‌లో ఉన్న రెజ్లర్లలో సుశీల్‌ కుమారే ఇప్పటికీ ఉత్తమ రెజ్లర్‌ అని టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన బజరంగ్‌ పునియా పేర్కొన్నాడు. 56 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ పతకం సాధించాడని బజరంగ్‌ కొనియాడాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దిల్లీలో బజరంగ్‌ పునియాను సన్మానించారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘భారత్‌లో సుశీల్ కంటే ఉత్తమ రెజ్లర్‌ ఉన్నాడని నేను అనుకోవడంలేదు. 56 ఏళ్ల కలను నిజం చేస్తూ అతడు 2008 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు పతకాన్ని తెచ్చిపెట్టాడు’ అని పేర్కొన్నాడు. అయితే తాను సుశీల్‌ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించదలుచుకోలేదని.. అతడి క్రీడా జీవితం గురించే మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశాడు.

సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లతో భజరంగ్‌ మాట్లాడుతూ.. గాయం కారణంగా ఈ ఒలింపిక్స్‌ సమయంలో తాను అత్యుత్తమ ఫామ్‌లో లేనట్లు తెలిపాడు. అయినప్పటికీ కాంస్యం సాధించినట్లు పేర్కొన్నాడు. ‘ఈ విశ్వక్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కోసం కృషి చేశా. వచ్చే ఒలింపిక్స్‌లో నా పతకం రంగును మార్చుకుంటా. కష్టపడితేనే ఏదైనా సాధించగలం’ అని పేర్కొన్నాడు. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌ ఓ హత్య కేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. సుశీల్‌ ప్రస్తుతం దిల్లీలోని ఓ జైలులో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని